దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న తరుణంలో కేరళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఈమేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని ఆక్సిజన్ నిల్వలను ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేశామని, ప్రస్తుతం 86 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
"ఆక్సిజన్ కేటాయింపులపై మే 6న కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇవాళ్టి వరకు రోజుకు 40 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేశాం. అయితే, మా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడం, మరోవైపు ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతుండటం వల్ల ఇకపై సరఫరా చేయడం సాధ్యం కాదు."
-పినరయి విజయన్, కేరళ సీఎం
"కేరళలో ప్రస్తుతం 4,02,640 క్రియాశీల కేసులు ఉన్నాయి. మే 15 నాటికి 6 లక్షలు దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మే 15 నాటికి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుంది" అని పినరయి తన లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ మృతదేహాన్ని గంగానదిలోకి విసిరిన వ్యక్తులు
ఇదీ చూడండి: 300 పదాలతో వ్యాసం రాస్తేనే సీవీసీ పదవి!