కర్ణాటక శాసనమండలి ఉపసభాపతి ధర్మె గౌడ మృతికి గల కారణాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక మండలి సమావేశాల్లో జరిగిన బాహాబాహీనే ఇందుకు కారణమై ఉండొచ్చన్న వాదనలు బయటకొస్తున్నాయి. అవమాన భారంతోనే ఇలా చేశారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చిక్కమగళూరు జిల్లాలోని గుణసాగర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న ఆయన.. సూసైడ్ నోట్‌ను వదిలి వెళ్లారు. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏముందో అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
డిసెంబర్ 15న జరిగిన మండలి సమావేశాల్లో గందరగోళం చోటు చేసుకుంది. సభ నిర్వహిస్తోన్న.. ఉపసభాపతి ధర్మె గౌడను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆయన స్థానం నుంచి కిందకు బలవంతంగా లాక్కొచ్చారు. ఆ స్థానంలో మండలి ఛైర్మన్ ప్రతాప్ చంద్ర శెట్టిని కూర్చోబెట్టారు. ఈ క్రమంలో భాజపా- కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భాజపా- జేడీఎస్ కలిసి ధర్మగౌడను బలవంతంగా ఆ కుర్చీలో కూర్చోబెట్టడం వల్లే తాము ఇలా చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చెప్పుకొచ్చారు.