POSH Act for Working Women : పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. స్థైర్యం, సహనం, పట్టుదలతో అన్నింటా ముందుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే.. నేటికీ దేశవ్యాప్తంగా చాలా మంది మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అయితే.. బాధిత మహిళలకు రక్షణగా కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. అందులో ఒకటే.. POSH యాక్ట్. ఈ చట్టం గురించి ప్రతీ మహిళ(Women) తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
POSH అంటే.. "ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్". ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.. పనిచేసేచోట మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడం. 2013లో ఆమోదం పొందిన ఈ చట్టం అదే సంవత్సరం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం.. పని ప్రదేశంలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులకు దిగినా.. బాధితులు వెంటనే పోష్ చట్టం కింద ఫిర్యాదు చేయొచ్చు.
మహిళలు అడుగు బయటపెడితే - హ్యాండ్ బ్యాగులో ఇవి ఉండాల్సిందే!
ఈ చట్టం పరిధిలోకి వచ్చే కొన్ని అంశాలు : అనుచితంగా తాకడం లేదా మహిళలు శారీరకంగా అసౌకర్యంగా ఫీలయ్యేలా చేయడం.. సైగలు చేయడం వంటివి పోష్ చట్టం కిందకు వస్తాయి. లైంగిక వ్యాఖ్యలు చేయడం, అశ్లీల కంటెంట్‌ను వారికి షేర్ చేయడం కూడా నేరమే. లైంగిక ప్రయోజనాల కోసం ఎలాంటి పనులు చేయాలని అడిగినా.. అవన్నీ POSH చట్టం పరిధిలోకి వస్తాయి. అందువల్ల ఈ చట్ట ప్రకారం.. బాధితులు ఎలాంటి భయమూ లేకుండా ఫిర్యాదు చేయవచ్చు.
ఎవరికి ఫిర్యాదు చేయాలి..?
అయితే.. POSH చట్టం కింద ఫిర్యాదు చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. చాలా మంది బాధిత మహిళలు.. పలు రకాల భయాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేరు. గౌరవానికి భంగం వాటిల్లుతుందనో.. అందరికీ విషయం తెలిసిపోతుందనో.. రకరకాల భయాలతో లైంగిక హింసను మౌనంగా భరిస్తుంటారు. ఇలాంటి వారికోసమే.. పోష్ చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం ఎవరికి ఫిర్యాదు చేయాలంటే..
ఆఫీసులో కమిటీలు..
పనిప్రదేశంలో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. వారిపై ఫిర్యాదు చేయడానికి ప్రతీ సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉంటుంది. ఇలాంటి కమిటీలను ప్రతి సంస్థా ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో కనీసం సగం మంది మహిళలే ఉండాలి. ఇక ఈ కమిటీ పని ఏంటంటే.. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి.. పోష్ చట్టం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఎప్పటిలోగా ఫిర్యాదు చేయాలి..?
పోష్ యాక్ట్ ప్రకారం.. సంబంధిత కార్యాలయ అంతర్గత కమిటీలో కావొచ్చు.. లేదంటే నేరుగా పోలీస్ స్టేషన్లో కావొచ్చు.. వేధింపులు ఎదుర్కొన్న 90 రోజుల్లోపు బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. అయితే.. ముందుగా ఆఫీస్‌లో ఫిర్యాదు చేయాలి. వేధింపుల తీవ్రతను కార్యాలయ కమిటీ ఫైల్ చేస్తుంది. ఆఫీసు కమిటీ తన విచారణ నివేదికను 10 రోజుల్లో సంస్థకు అందించాలి. నిందితులు దోషిగా తేలితే.. కంపెనీ వారిపై చర్యలు తీసుకుంటుంది. కావాలనుకుంటే.. పోలీస్ స్టేషన్‌కూ వెళ్లొచ్చు.
అమ్మాయిలు, మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఇబ్బందులే!