Prashant Kishor Meets Nitish Kumar: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి దిల్లీలోని నితీశ్ నివాసంలో దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. రెండేళ్ల క్రితం జనతాదళ్(యునైటెడ్) పార్టీ నుంచి పీకేను తప్పించిన తర్వాత వీరిద్దరూ భేటీ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పాత అనుబంధాల కారణంగానే పీకేతో తాను సమావేశమైనట్లు నితీశ్ కుమార్ మీడియాకు తెలిపారు. అటు పీకే కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. "నితీశ్‌జీ కరోనా బారిన పడినప్పుడు నేను ఫోన్ చేసి పరామర్శించారు. ఆ సమయంలో నన్ను కలవాలనుకుంటున్నట్లు నితీశ్ చెప్పారు. అందుకే నేడు మర్యాదపూర్వకంగా కలిశాను" అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. అయితే రాజకీయాల అంశాన్ని ఇద్దరూ కొట్టిపారేయ్యలేదు. దీంతో వీరి భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2024 Election Strategies: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేయాలన్న ప్రణాళికలో ఉన్న పీకే.. నితీశ్‌ను కలవడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జేడీయూ నుంచి వైదొలిగినప్పటికీ నితీశ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని పీకే పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అంతేగాక, నితీశ్‌తో కలిసి మళ్లీ పనిచేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలిపారు.
అటు బిహార్‌లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. నితీశ్‌కు కూడా పీకే అవసరం చాలానే ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ భేటీ ద్వారా భాజపాకు నితీశ్ గట్టి సందేశం ఇవ్వాలని భావించినట్లు బిహార్ సీఎం సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2020 బిహార్ ఎన్నికల్లో భాజపాకు అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ.. ఎన్డీయే కూటమి నితీశ్‌ను సీఎంగా ఎంచుకుంది. అయితే ఈ మధ్య నితీశ్‌తో భాజపాకు మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య చాలా సందర్భాల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా నితీశ్ వ్యాఖ్యలు చేశారు.
2018 సెప్టెంబరులో పీకే.. జేడీయూ పార్టీలో చేరారు. నితీశ్ ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2020లో పీకేను జేడీయూ నుంచి బహిష్కరించారు.
ఇదీ చదవండి: పంజాబ్ అసెంబ్లీకి పోలింగ్.. యూపీలో మూడో విడత