బంగాల్ శాసనసభ ఎన్నికలకు నెలల సమయమే ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీఎంసీ.. తొలిసారి బంగాల్ పీఠం అధిరోహించాలన్న పట్టుదలతో ఉన్న భాజపా హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మూడేళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన గోర్ఖా జన్ముక్తి మోర్చా(జీజేఎం) మాజీ అధినేత.. బిమల్ గురుంగ్ ఊహించని, నాటకీయ పరిణామాల మధ్య తిరిగి రాజకీయ తెరపైకి వచ్చారు. అంతేకాకుండా అధికార తృణమూల్‌కు మద్దతు ప్రకటిస్తూ భాజపాకు షాక్ ఇచ్చారు. 2017లో నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద తీవ్ర నేరారోపణలు ఎదుర్కొన్న అనంతరం ఎవరికీ కనిపించకుండా కనుమరుగయ్యారు బిమల్.
డార్జిలింగ్ కొండల్లో హింసాత్మక ఆందోళనలకు పథక రచన చేశారన్న నెపంతో.. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు బనాయించింది. 2017 ఘర్షణల్లో 11మంది పౌరులు, ఒక పోలీస్ అధికారి మరణించారు. ఈ వివాదం అనంతరం బిమల్.. దిల్లీ, సిక్కిం, నేపాల్, ఝార్ఖండ్లలో తలదాచుకుంటూ పలుమార్లు కనిపించారు. అన్ని పర్యవసనాల అనంతరం బిమల్ గురుంగ్.. ఒక్కసారిగా అక్టోబర్ 21న ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి.. బహిరంగంగానే భాజపాను ఏకిపారేశారు. రాజకీయవర్గాలను ఈ ఎత్తు ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే బిమల్.. 2007 నుంచి భాజపాకే మద్దతుగా నిలబడుతూ వస్తున్నారు. ఆయన అండతో డార్జిలింగ్ లోక్‌సభ స్థానాన్ని భాజపా.. వరుసగా 3 సార్లు దక్కించుకోగలిగింది. ఇప్పుడు డార్జిలింగ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను భాజపా పట్టించుకోలేదని బిమల్ గురుంగ్ ఆరోపిస్తున్నారు.
అసలీ వివాదాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి ?
యూపీఏ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం 'ప్రత్యేక డార్జిలింగ్ రాష్ట్రం' ఆశలకు రెక్కలు తొడిగింది. బోడోలాండ్, బుందేల్‌ఖండ్, విదర్భ, హరిత్ ప్రదేశ్ వంటి ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్ చేసే గొంతుకలకు కొత్త శక్తి వచ్చింది. వీటిలో గోర్ఖాల్యాండ్ చారిత్రక కారణాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఉత్తర బంగాల్లోని గోర్ఖాలు శతాబ్దం నుంచే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ వినిపిస్తున్నారు. ఇందుకోసం 1907లోనే డార్జిలింగ్ కొండల్లో హిల్మెన్స్ అసోసియేషన్ ఆఫ్ డార్జిలింగ్.. హెచ్ఏడీ ఏర్పాటైంది. మార్లో-మింట్ సంస్కరణలకు అనుగుణంగా ప్రత్యేక పాలన డిమాండ్ ఊపందుకుంది. 1917లో హెచ్ఏడీ.. నాటి బంగాల్ ప్రభుత్వానికి ప్రత్యేక మెమోరాండం అందజేసింది. డార్జిలింగ్-జల్పైగురిలను కలిపి ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలని కోరారు.
అయితే, నాటి బ్రిటిష్ పాలకులు ఈ పిటిషన్లను పెద్దగా పట్టించుకోలేదు. గోర్ఖాలు మాత్రం వెనక్కితగ్గలేదు. ఆ తర్వాత 1930, 1941లలో సైమన్ కమిషన్ ముందు తమ వాదనను బలంగా వినిపించారు. బంగాల్ నుంచి వేరు చేసి.. ప్రత్యేక పాలనా ప్రాంతంగా మార్చాలన్న డిమాండ్ తీవ్రరూపం దాల్చింది. ఇక 1952లో అఖిల భారత గోర్ఖా లీగ్ నేతలు, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కలిసి ప్రత్యేక ఆర్థిక స్వాతంత్ర్యం ప్రకటించాలని, గోర్ఖాలకు విలక్షణ గుర్తింపు ఇవ్వాలని విన్నివించారు. చాలా ఏళ్లపాటు శాంతియుతంగానే వారి డిమాండ్లను వినిపించారు గోర్ఖాలు.
ఆశయ సాధనకు హింసామార్గం..
అప్పటివరకూ శాంతియుతంగా పోరాడిన గోర్ఖాలు.. 1980లో గోర్ఖాల్యాండ్ రాష్ట్ర సాధనకు హింసబాట పట్టారు. ఆ ఏడాది ఏప్రిల్ 5న, డార్జిలింగ్ కొండల్లో రక్తం చిందింది. సుభాష్ ఘిసింగ్ నేతృత్వంలోని గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్.. ఎనిమిదేళ్ల పాటు చేసిన సాయుధ పోరాటంతో డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ పేరిట స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించటం.. ఆ కొండల్లో రక్తం ఏరులైపారేలా చేసింది. ఈ ఘర్షణల్లో దాదాపు 1200మంది అసువులుబాసారు.
కొండల్లో అధికారమే లక్ష్యంగా ఏర్పాటైన డీజీహెచ్‌సీ కౌన్సిల్.. సుభాష్ ఘిసింగ్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగించింది. అంతర్గత అధికార కాంక్షతో ఉన్న కొంతమంది నాయకులు.. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను కొనసాగించారు. 2004లో ఈ కౌన్సిల్ పాలనలో ఉన్న ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లోకి తీసుకురావాలనే డిమాండ్‌ను సుభాష్ లేవనెత్తారు.
6వ షెడ్యూలేనా.. అంతకుమించా ?
రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పరిశీలకులు.. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ నిబంధనలు గోర్ఖాల స్వయంపాలన ఆకాంక్షలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా అభివర్ణించారు. మరిన్ని తిరుగుబాట్లకు అవకాశం లేకుండా చేస్తుందని వెల్లడించారు. అప్పటికే అసోంలోని బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ విషయంలో ఇదే అనుసరిస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తున్న గోర్ఖాలకు.. ఇది ఇబ్బందికరమైందే. అయితే, 6వ షెడ్యూల్ కింద ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కాకూడదన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేకపోవటం వారిని శాంతపరిచింది.
ఆ తర్వాత ఏం జరిగింది ?
ఒక వైపు ఘిసింగ్ 6వ షెడ్యూల్ డిమాండ్‌ను ఉద్ధృతం చేస్తున్న సమయంలో.. ఈ నిబంధనలను అర్థం చేసుకోవటంలో తప్పటడుగులు వేసిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు కొత్త ఆందోళనలకు ఆజ్యం పోశారు. దీంతో 6వ షెడ్యూల్ ఆలోచనలను కేంద్రం విరమించుకుంది.
అనంతరం ఘిసింగ్ నియంతృత్వ పనితీరు, కొండల్లో దుర్భరమైన రహదారి పరిస్థితులు, తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, నీటిపారుదల వ్యవస్థ దురావస్థ వెరసి.. ప్రజలకు డీజీహెచ్‌సీ పనితీరు పట్ల సందేహాలు రావటం ఆరంభమైంది. అనేక మంది కౌన్సిల్ సభ్యులు ఘిసింగ్‌తో విభేదించడం ప్రారంభించారు. ఇక 2007 నాటికి అంతర్గత విభేధాలు తీవ్రమై గోర్ఖాలలో ఐక్యత లోపించింది.
బిమల్ గురుంగ్ ప్రస్థానం..
సుభాష్ ఘిసింగ్ శకం ముగిసిన తర్వాత.. గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌లో సరికొత్త నాయకుడిగా ఆవిర్భవించారు బిమల్ గురుంగ్. టీవీ రియాల్టీ షోలో.. స్థానిక యువకుడిని గెలిపేంచేందుకు కృషి చేసి దేశం మరోసారి గోర్ఖాలవైపు చూసేలా చేశారు. ఈ నేపథ్యంలోనే జీఎన్ఎల్ఎఫ్ నుంచి వేరుపడి.. గోర్ఖా జన్ముక్తి మోర్చా ఏర్పాటు చేశారు. గతంలో ఘిసింగ్ నాయకత్వంలో నేతగా ఉన్న బిమల్‌పై విమర్శలు వచ్చినా.. ఆయన ప్రజాదరణ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇక రాజకీయ మద్దతు ఆశించిన బిమల్.. తన జీజేఎంను భాజపాకు మద్దతుగా నిలిపారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి జశ్వంత్ సింగ్‌ను గెలిపించారు. ఆయన డార్జిలింగ్ ఎంపీగా వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. గోర్ఖాలకు ప్రత్యేక రాష్ట్రం సాధించటమే ప్రధాన ఎజెండాగా ఆయన గెలుపొందారు. మరోవైపు పశ్చిమ్ బంగా అసెంబ్లీ ఏకగ్రీవంగా.. రాష్ట్రంలోని ప్రాంతాల విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిమల్ గురుంగ్ తనకు బాగా తెలిసిన హింసనే మార్గంగా ఎంచుకున్నారు.
ఇదీ చూడండి: జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా: బంగాల్ సీఎం
మళ్లీ రక్తమోడిన డార్జిలింగ్ కొండలు..
ఇక 2011 ఉద్యమం పేరుతో.. జల్పైగురిలో చేపట్టిన లాంగ్‌మార్చ్‌లో గోర్ఖా జన్ముక్తి మోర్చా మద్దతుదారులపై పోలీసులు కాల్పులు జరిపారు. కొండల్లో హింస చెలరేగింది. దాదాపు 9రోజుల పాటు బంద్ నిర్వహించారు.
2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలను మట్టికరిపించి.. మమతా బెనర్జీ బంగాల్ పీఠం అధిరోహించారు. అయితే, జీజేఎం కొండల్లోని డార్జిలింగ్, కుర్సెయింగ్, కాలింపోంగ్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక జులైలో 2011, జీజేఎం-బంగాల్ సర్కార్-కేంద్ర ప్రభుత్వాల మధ్య.. ఈ ప్రాంతంలో గోర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో.. కార్యనిర్వాహక మండలి ఏర్పాటైంది.
2012లో జీటీఏలో జరిగిన ఎన్నికలకు ముందు.. రాష్ట్ర అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టింది. అప్పుడు బిమల్ జీజేఎం-మమత సర్కార్ల మధ్య అన్ని సవ్యంగానే నడిచాయి. అయితే, మరోసారి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆ ప్రాంతంపై రాజకీయ పట్టు కోసం.. మమతా బెనర్జీ సరికొత్త ఎత్తులు ప్రారంభించారు. జీజేఎం చెప్పినట్లు తలాడించేందుకు సిద్ధంగా లేని దీదీ.. అక్కడ గోర్ఖాల్యాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా.. పరిపాలన వ్యవహారాల నిమిత్తం ఇద్దరు మంత్రులను పర్యవేక్షణ కోసం నియమించారు. మరోవైపు నిధుల కేటాయింపుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించిన మమత సర్కారు.. డార్జిలింగ్ కొండల్లో ప్రజల మద్దతు కూడగట్టుకోగలిగింది. ఈ విషయాన్ని గుర్తించిన బిమల్.. తన గోర్ఖా జన్ముక్తి మోర్చాను కాపాడుకునేందుకు జీటీఏ నుంచి బయటకు వచ్చేశారు.
అప్పటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయి. 2016లో రెండోసారి అధికారం చేపట్టిన మమతా బెనర్జీ.. డార్జిలింగ్, మిరిల్లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జీజేఎంను మట్టికరిపించారు. ఆ తర్వాత రాష్ట్రమంత్రివర్గ సమావేశం.. డార్జిలింగ్‌లో చేపట్టాలని నిర్ణయించటం పరిస్థితులు మరింత విషమించేలా చేసింది.
ఆజ్ఞాతంలోకి బిమల్
ఆ ఏడాదే.. పశ్చిమ్ బంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బంగాలీ బోధన తప్పనిసరి చేసింది. నేపాలీ గోర్ఖాలు ఎక్కువగా ఉండే డార్జిలింగ్‌లో సైతం.. ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అప్పటికే అసహనంతో రగిలిపోతున్న బిమల్ గురుంగ్ ఇదే సరైన అవకాశమని భావించి.. డార్జిలింగ్, తెరాయి ప్రాంతాల్లో నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. కొండల్లో అల్లర్లు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ఆ ప్రాంతానికి భారీగా భద్రతా బలగాలను పంపింది. హింసాత్మకంగా మారిన ఘర్షణలు.. 104రోజుల పాటు అక్కడ తీవ్ర అశాంతిని రాజేశాయి. భారీగా ప్రాణ-ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఒకానొక దశలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డార్జిలింగ్ తేయాకు ఉత్పత్తి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బిమల్ గురుంగ్, ఆయన మద్దతుదారులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇక తప్పని పరిస్థితుల్లో బిమల్, జీజేఎం మద్దతుదారులు వేరే ప్రాంతాలకు పారిపోయారు.
అనంతరం జీజేఎం విడిపోయింది. బిమల్ విధేయుల్లో ఒకరైన బినయ్ తమంగ్ మరో వర్గం నేతగా ఎదిగారు. ప్రస్తుతం మరో నేత అనిత్ థాపాతో కలిసి జీటీఏను నడుపుతున్నారు. నాడు ఘర్షణలు జరుగుతున్నపుడే బినయ్ తమంగ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ?
మూడేళ్ల తర్వాత సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షమైన బిమల్ గురుంగ్.. మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించడాన్ని గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో జీజేఎంలో వివాదాలు సమసిపోనున్నాయి. బిమల్ వర్గం-బినయ్ తమంగ్ వర్గం టీఎంసీతో చేతులు కలపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఏళ్లుగా పోరాడుతున్న గోర్ఖాల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇక డార్జిలింగ్ కొండల్లోంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మరో శక్తి పుట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో భాజపా పరిస్థితి గందరగోళంగా మారింది.
ఇదీ చూడండి: 'ఫార్ములా 23'తో భాజపా 'బంగాల్ మిషన్-200'
ప్రస్తుతం భవిష్యత్తు ఏంటన్నది ఎవరూ అంచనా వేయలేని స్థితిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని భాజపా సర్కారు.. బిమల్ నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
1879లో డార్జిలింగ్ కొండల్లో రైల్వే లైన్లు వేసినప్పుడు.. 'జెడ్-రివర్స్' విధానాన్ని అనుసరించారు. కొండల ఎత్తులను దాటేందుకు ఇది వినూత్న మార్గంగా చెబుతారు. ముందున్న ఎత్తులను ఎక్కలేనప్పుడు వెనక్కితగ్గి.. మరో మార్గంలో పయనించటమే ఈ విధానం ఉద్దేశం. ప్రస్తుతం డార్జిలింగ్, తెరాయ్ లోయల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎత్తులను చిత్తు చేసి.. బంగాల్ దంగల్‌లో నెగ్గేదెవరో వేచి చూడాలి.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!
ఇదీ చూడండి: 'బంగాల్ దంగల్'కు కాంగ్రెస్ వ్యూహరచన