Polio Virus in India: దేశం నుంచి పోలియోను విజయవంతంగా తరిమికొట్టామని చెప్పుకుంటున్న తరుణంలో దాని ఉనికిని గుర్తించటం కలకలం సృష్టిస్తోంది. బంగాల్ రాజధాని కోల్‌కతాలోని మేతియాబురుజ్ ప్రాంతంలో మురుగు నీటిలో టైప్-1 పోలియో వైరస్‌ను గుర్తించారు. దీంతో అధికారులను అప్రమత్తం చేసినట్లు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అతిన్ ఘోష్ తెలిపారు.
ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి డ్రైనేజీ నీటిలో పోలియో వైరస్ ఆనవాళ్లను గుర్తించామన్నారు ఘోష్. పోలియో వైరస్ మూలాలను కనిపెట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తమ ప్రాంతంలో ఎవరైనా పోలియో రోగులు ఉన్నారేమో నిర్ధరించుకోవాలని వార్డు కౌన్సిలర్లు, పోలీస్ స్టేషన్లను ఆదేశించారు. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా బహిరంగ మలవిసర్జన చేయకుండా చూడాలన్నారు.
"2010లో ఆరోగ్య విభాగం బాధ్యతలను మేము తీసుకున్న తర్వాత.. 2013 నాటికి పోలియో కేసులు తగ్గిపోయాయి. పోలియో టీకాలు వేసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పోలియో కేసులు తగ్గిన క్రమంలో 2014, మార్చి 27న భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత ఎనిమిదేళ్లుగా పోలియో కేసులపై నిఘా పెట్టాం. సాదారణ తనిఖీల్లో భాగంగా గార్డెన్‌రీచ్ ప్రాంతంలోని వార్డులు 139,140,149లోని మురుగు నీటిలో వైరస్‌ను గుర్తించాం. "
- అతిన్ ఘోష్, డిప్యూటీ మేయర్
భారత్‌లో చివరగా 2011, జనవరి 13న బంగాల్లోని హావ్‌డా ప్రాంతంలో పోలియో కేసు నమోదైంది. అప్పటి నుంచి దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి పోలియో రహిత దేశంగా 2014, మార్చి 27 గుర్తింపు లభించింది. ముందు జాగ్రత్తగా ఐదేళ్ల లోపు పిల్లలకు ఏటా పోలియో టీకాలు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చూడండి: బొట్టు బిళ్లలతో 100 అడుగుల పెయింటింగ్.. మోదీ కోసం..