అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసులో అనుమానాస్పద రీతిలో మరణించాడు మన్సుఖ్ హిరేన్. అతడి మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజే వాట్సాప్ స్టేటస్‌లోని సందేశం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ప్రపంచానికి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన సందేశంలో పేర్కొనడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
గతంలో 2004 మార్చి 3న తనను ఓ ఫేక్ కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేశారని, ఇప్పుడు అదే కుట్ర మళ్లీ జరుగుతోందని సచిన్ వాజే తన వాట్సాప్ స్టేటస్ సందేశంలో వెల్లడించారు. సహోద్యోగులే అప్పుడు తనను ఇరికించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటి కేసు, అప్పటి కేసుకు వ్యత్యాసాలున్నప్పటికీ, పాత కేసుకు 17ఏళ్ల పాటు ఓపిక, సహనంతో తన జీవితాన్ని, వృత్తిని ధార పోశానని, ఇప్పటి కేసును ఎదుర్కొనేందుకు మరో 17 ఏళ్లు తాను కేటాయించలేనని సచిన్ వాజే వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆవేదనను వెలిబుచ్చారు. అందుకే ఈ ప్రపంచానికి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన రాసుకొచ్చారు.
హిరేన్ మృతి కేసులో ముందస్తు బెయిల్ కోసం సచిన్ వాజే.. ఠాణె కోర్టును ఆశ్రయించారు.