Poli Padyami 2023 Date and Pooja Vidhanam: కార్తికమాసం చివరి దశకు చేరుకుంది. మంగళవారం(డిసెంబర్ 12)తో ఈ మాసం ముగుస్తోంది. ఆ మర్నాడు అంటే.. బుధవారం రోజున పోలి పాడ్యమి పర్వదినం. ఈ పోలి పాడ్యమితో కార్తిక మాసానికి సంబంధించిన అన్ని పూజాలూ పూర్తవుతాయి. అంతేకాదు.. ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే.. కార్తికమాసం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందట! ఇంతకీ ఎవరీ పోలి..? ఆమె వెనుక ఉన్న కథ ఏంటి..? ఆరోజున పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పోలిపాడ్యమి కథ ఇదే!: పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్నకోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచీ దైవ భక్తి ఎక్కువ. కానీ అదే భక్తి అత్తగారికి నచ్చలేదు. కారణం.. తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదు, తనే నిజమైన భక్తురాలు అనే అహంకారంతో ఉండేది. అందుకే చిన్నకోడలైన పోలితో పూజలు చేయనిచ్చేది కాదు. కార్తికమాసం వచ్చినప్పుడు కూడా మిగిలిన కోడళ్లను తీసుకుని నదికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించుకుని పూజలు చేయించి వచ్చేది. కానీ పోలిని పట్టించుకునేది కాదు.. పైగా తనకు ఎలాంటి సౌకర్యం లేకుండా చేసేది.
కానీ పోలి మాత్రం బాధపడేది కాదు.. అత్తగారు, తోడికోడళ్లు అటు వెళ్లగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరి కంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేంది. ఇలా మాసమంతా సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నిత్యం దీపారాధన చేసేది. చివరికి కార్తిక అమావాస్య పూర్తై ఆ మర్నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి వచ్చింది. ఆ రోజు కూడా అందరూ నదికి వెళ్లిపోతూ.. పోలికి చేతినిండా పని అప్పగించి వెళ్లిపోయారు. ఆరోజు కూడా ఎప్పటిలా ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తికదీపం వెలిగించింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలి భక్తి తప్పకపోవడం చూసి దేవతలంతా ఆమెను దీవించారు. ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవదూతలు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు.. మిగిలిన తోడికోడళ్లు విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది తమ కోసమే వచ్చిందనుకున్నారు. కానీ అందులో పోలిని చూసి నిర్ఘాంతపోయారు. తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే తాపత్రయంతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన భక్తి ఉందని చెప్పి వారిని కిందనే వదిలేసి పోలిని తీసుకెళ్లిపోయారు. అందుకే ఆరోజును అంటే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు.
కార్తికమాసంలో తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి!
స్వర్గ ద్వారం ప్రవేశం కోసమే దీపం!: కార్తిక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి.. పోలి కథను చెప్పుకుని ఆమెలా స్వర్గ ద్వార ప్రవేశం కల్పించాలని భక్తులు ప్రార్థిస్తారు. నెల రోజులూ ఎలాంటి నియమాలు పాటించని వారు కనీసం పోలి పాడ్యమి రోజైనా 30 ఒత్తులను వెలిగించి అరటి దొప్పల్లో పెట్టి నీటిలో వదులుతారు.
ఆరోజు పూజ ఎలా చేయాలి:
- మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున స్త్రీలు వేకువజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- తర్వాత నదీ స్నానాలు ఆచరించాలి. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అరటి దొప్పలపై పెట్టి నదుల్లో విడిచిపెట్టాలి.
- అదే విధంగా ఆ నది మాతను పసుపు, కుంకుమ, పూలతో పూజిస్తారు.
- పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ.. నమస్కారం చేసుకుని పోలి కథను వినాలి.
- నదులు అందుబాటులో లేనివారు ఇళ్లల్లో ఉండే బోర్లు లేదా బావి నీటితో స్నానం చేయాలి.
- ఆ తర్వాత ఒక గిన్నెలో లేదా బకెట్లో నీటిని పోసి తులసి కోట ముందు ఈ దీపాలను వెలిగించి గంగా దేవికి నమస్కరించడం ద్వారా పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కార్తికమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? - పండితులు ఏం చెబుతున్నారు?