ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన) పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. లబ్ధిదారులైన మహిళలకు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను అందజేశారు. పథకాలు, వనరుల ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంట్లో ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్ ఉండాలని సంకల్పించినట్లు తెలిపారు.
" రహదారులు, విద్యుత్, ఆరోగ్యం, ఎల్‌పీజీ వంటి ప్రాథమిక అవసరాలను గత ప్రభుత్వాలు తీర్చడం కోసం ప్రజలు దశాబ్దాలు వేచి ఉండాల్సి వచ్చింది. 2014కు ముందు ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ క్రీడల గురించి కూడా మాట్లాడారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో ఖేల్‌రత్న అవార్డు పేరును మార్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయం క్రీడల్లో కొనసాగించాలనుకునే లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఒలింపిక్స్‌లో అథ్లెట్లు పతకాలు సాధించడం.. భారతీయ క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని అన్నారు.
ఇదీ చూడండి: World Lion Day: 'గత కొన్నేళ్లలో సింహాల సంఖ్య పెరిగింది'