బంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగే సభకు హాజరు కానున్నారు. అసెంబ్లీ షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో భాజపా చేపడుతున్న అతిపెద్ద ప్రచార కార్యక్రమం ఇదే కానుంది.
మోదీ హాజరవుతున్న ఈ సభను విజయవంతం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ మైదానంలో ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో ప్రజలు హాజరయ్యేలా కసరత్తులు చేస్తున్నారు.
భాజపాలోకి మిథున్!
మోదీతో పాటు భాజపా అగ్రనేతలు సైతం ఈ ర్యాలీకి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించాయి. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సభా వేదికపై కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే, పార్టీలో మిథున్ చక్రవర్తి చేరికపై తాము చర్చించలేదని భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా తెలిపారు.
ఒకప్పుడు సీపీఎంకు సన్నిహితంగా ఉన్న మిథున్.. అనంతరం టీఎంసీ తరపున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాల్లోంచి వైదొలిగే ఉద్దేశంతో పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: ప్రచార పర్వం- రసవత్తరంగా బంగాల్ రాజకీయం