PM Modi With Amarinder Singh : పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉందని భాజపా వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా ఫిరోజ్పుర్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్)కు చెందిన శాటిలైట్ సెంటర్ను మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ర్యాలీలో పాల్గొంటారని సమాచారం.
రైతు చట్టాలను రద్దు చేసిన తర్వాత పంజాబ్లో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినాయకుడు అమరీందర్ సింగ్, ప్రధాని మోదీ ర్యాలీలో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. అమరీందర్ సింగ్తో పాటు పంజాబ్ ఎన్నికల ఇంఛార్జీ గజేంద్ర షెకావత్ కూడా ర్యాలీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'గత పాలకులకు యూపీ అభివృద్ధిపై ధ్యాసే లేదు'