బుద్ధుడి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 'వేసక్ అంతర్జాతీయ వేడుకల్లో' ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. కొవిడ్ ఉద్ధృతిలో నిస్వార్థ సేవలందిస్తున్న వైద్య సిబ్బంది సహా.. ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లను మోదీ అభినందించారు.
"కరోనా మహమ్మారి సంక్షోభంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ.. నిస్వార్థ సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బంది, వైద్యులు, నర్సులకు మరోసారి వందనాలు. అలాగే ఆత్మీయులను పోగొట్టుకున్న వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా."
-ప్రధాని నరేంద్ర మోదీ
కరోనా తర్వాత భూగ్రహం కచ్చితంగా ఇప్పుడున్నట్లుగా అయితే ఉండదని మోదీ తెలిపారు. ఈ శతాబ్దంలోనే ప్రపంచం ఇలాంటి మహమ్మారిని చూడలేదని అన్నారు. భవిష్యత్ సంఘటనలన్నీ కొవిడ్‌కు ముందు, ఆ తర్వాతే అన్నంతంగా గుర్తుంచుకుంటామని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని జయించేందుకు టీకా ఒక్కటే మార్గమని తెలిపారు. 'ట్రిపుల్-బ్లెస్డ్ డే'గానూ పరిగణించే ఈ వేడుకల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సంఘాల అత్యున్నత అధిపతులందరూ పాల్గొన్నారు.
"ఇప్పుడు మనకు మహమ్మారిపై మంచి అవగాహన ఉంది. సరికొత్త వ్యూహాలతో పోరాడగలం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, మహమ్మారిని ఓడించేందుకు టీకానే అత్యంత ముఖ్యమైనది. వ్యాక్సిన్ల తయారీ కోసం కృషి చేసిన మన శాస్త్రవేత్తలు దేశానికే గర్వకారణం."
-ప్రధాని నరేంద్ర మోదీ
ఇవీ చదవండి: తమిళనాడులో ఆందోళనకర స్థాయిలో కరోనా