దిల్లీలో పార్లమెంటు నూతన భవన నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి స్వయంగా పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి రాత్రి 8:45 గంటల సమయంలో వెళ్లిన మోదీ.. సుమారు గంటపాటు అక్కడే ఉన్నారు. పార్లమెంటు నిర్మాణ పనులను మోదీ పర్యవేక్షించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో భాగమైన సెంట్రల్ విస్టా అవెన్యూ (central vista avenue) మరో రెండున్నర నెలల్లో పూర్తి అవుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇదివరకు వెల్లడించారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం (Republic day) నాటికి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటుందని (central vista avenue) తెలిపారు. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త పార్లెమెంటు భవనంలోనే జరుగుతాయని పురీ పేర్కొన్నారు.
గతేడాది డిసెంబరులో దిల్లీలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. తొలుత నూతన భవనం ప్రాంగణంలో భూమిపూజ నిర్వహించిన మోదీ.. శంకుస్థాపన శిలాఫలకాన్ని అక్కడ ఆవిష్కరించారు.
ఇదీ చూడండి: 'సెంట్రల్ విస్టా'పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం