21వ శాతాబ్దంలో దేశాభివృద్ధికి వ్యవసాయం, సైన్స్ మధ్య సమన్వయం ఎంతో కీలకమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi). వ్యవసాయ రంగంలోని సవాళ్ల పరిష్కారానికి ఏడేళ్లుగా శాస్త్ర, సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక లక్షణాలున్న 35 పంట రకాలను (Crop Varieties) జాతికి అంకితం చేసిన సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఈ సరికొత్త పంట రకాలను ఆధునిక ఆలోచన కలిగిన రైతులకు అంకితమిస్తున్నా. వ్యవసాయ రంగంలోని సవాళ్ల పరిష్కారానికి ఏడేళ్లుగా శాస్త్ర, సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నాం. ప్రత్యేకించి మారుతున్న కాలాలకు అనుగుణంగా, పోషక విలువలు కలిగిన విత్తనాలపై దృష్టి సారించాం."
-ప్రధాని నరేంద్ర మోదీ
కొత్త పంట రకాలతో (crop variety improvement) దేశంలోని పోషకాహార లోపాలు తగ్గుతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గతేడాది.. పలు రాష్ట్రాల్లో మిడతల దాడిని ప్రస్తావిస్తూ.. ఎన్నో ప్రయత్నాల తర్వాత వాటిని అడ్డుకొని రైతులకు భారీ నష్టాన్ని తప్పించినట్లు చెప్పారు.
ఆకాంక్షల భారతం...
తగిన రక్షణ లభిస్తేనే వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని అన్నారు. రైతుల భూమికి రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం 11 కోట్ల భూసార కార్డులను అందజేసిందని తెలిపారు. 25 ఏళ్ల తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ శతాబ్ది వేడుకలు జరగనున్నాయని.. ఈలోపు దేశ సంకల్పాలెన్నో నిజమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా రాయ్‌పుర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ నూతన భవనాన్ని కూడా మోదీ (PM Modi Latest News) వర్చువల్‌గా ప్రారభించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులను ప్రదానం చేశారు. సాగులో వినూత్న పద్ధతులను అవలంబిస్తున్న రైతులతో సంభాషించారు.
ఈ సరికొత్త పంటరకాలను (Crop Varieties) భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) అభివృద్ధి చేసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ ఏడాదిలోనే 35 వెరైటీ వంగడాలను ఐసీఏఆర్ తయారు చేసినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: farm income: ఛిద్రమవుతున్న శ్రమజీవి బతుకు చిత్రం!