భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ టెలిఫోన్లో సంభాషించారు. అంతర్జాతీయ వ్యవహారాలు, అఫ్గాన్ పరిస్థితులు, వాతావరణ మార్పు లక్ష్యాలు వంటి కీలక విషయాలపై చర్చించారు. భారత వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను అధికారికంగా గుర్తించేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు.
" అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై మోదీ, బోరిస్ చర్చించారు. తాలిబన్లతో సంబంధాల విషయమై అంతర్జాతీయంగా సమన్వయంతో ముందుకుసాగాలని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌లో మానవహక్కులను కాపాడాల్సిన అవశ్యకతను ప్రస్తావించారు. కరోనాపై ఉమ్మడి పోరు, అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై మాట్లాడారు. భారత్-బ్రిటన్ రోడ్‌మ్యాప్ 2030లోని లక్ష్యాల సాధనలో పురోగతిపై బోరిస్, మోదీ చర్చించారు"
-బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి.
అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు గ్లాస్గోలో జరగనున్న వాతావరణ శిఖరాగ్ర సదస్సు కాప్-26 నేపథ్యంలో వాతావరణ మార్పు లక్ష్యాల పురోగతిపైనా మోదీతో బోరిస్ చర్చించారు. పునరుత్పాదక ఇంధన శక్తిలో భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలతో పోల్చితే ముందుందని, త్వరలోనే కర్బన ఉద్గారాలు సున్నాకు చేరతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత్-బ్రిటన్ సంబంధాలపైనా బోరిస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో ఇరు దేశాలు రూపొందించిన రోడ్‌మ్యాప్-2030 లక్ష్యాల పురోగతిని స్వాగతించారు.
అఫ్గాన్‌పై నేడు జీ-20 సదస్సు..
అఫ్గానిస్థాన్ అంశంపై చర్చించడానికి జీ-20 దేశాల అసాధారణ సమావేశం మంగళవారం వర్చువల్‌గా జరగనుంది. ప్రధాని మోదీ దీనిలో పాల్గొంటారు. తాలిబన్లు కైవసం చేసుకొన్న తరువాత అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులపై నేతలు సమగ్రంగా చర్చించనున్నారు. అక్కడి ప్రజల అవసరాలు, వారి భద్రత, ఉగ్రవాదంపై పోరు, మానవ హక్కులు వంటి అంశాలు అజెండాలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: 15ఏళ్ల స్టూడెంట్‌తో రిలేషన్- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్