PM Modi Kedarnath: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కేదార్నాథ్ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేదారీశ్వరుడ్ని దర్శించుకున్నారు. జగద్గురు ఆదిశంకారాచార్య సమాధిని కూడా సందర్శించారు.
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. వాటితో పాటు రూ.3400 కోట్ల విలువైన మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు 9.7 కిలోమీటర్ల రోప్‌వే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత బద్రీనాథ్ చేరుకుని.. నదీతీర వెంబడి అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు.
అంతకుముందు దెహ్రాదూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘనస్వాగతం పలికారు. ప్రధాని పర్యటన దృష్ట్యా రెండు ప్రసిద్ధ దేవాలయాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు ఆలయాలను క్వింటాళ్ల కొద్ది పూలతో అలంకరించారు.