ప్రపంచ దేశాల పట్ల విధేయతతో కరోనా టీకా సాయాన్ని భారత్ అందజేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భగవద్గీత కూడా ఇదే బోధిస్తోందని పేర్కొన్నారు. స్వామి చిద్భవానందజీ రచించిన భగవద్గీత కిండల్ వర్షన్‌ను ఆయన వర్చువల్‌గా ఆవిష్కరించారు. గీత నుంచి స్ఫూర్తి పొందినవారు సహజంగా కరుణామయులై ఉంటారని అన్నారు.
"గీత మనలో ఆలోచనను కలిగిస్తుంది. ప్రశ్నించడం నేర్పిస్తుంది. చర్చించేలా ప్రోత్సహిస్తుంది. మన మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది. గీత నుంచి స్ఫూర్తి పొందినవారు ఎవరైనా సహజంగా చాలా కరుణతో ఉంటారు. ప్రపంచానికి ఇటీవల ఔషధాలు అవసరమైతే భారత్ సాయం అందించింది. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లను ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. మనం కోలుకోవడమే కాకుండా మానవాళికి సాయపడాలని భారత్ కోరుకుంటోంది. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని మనకు బోధిస్తోంది."
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
సంపద, విలువలను సృష్టించుకోవడమే 'ఆత్మనిర్భర్ భారత్' ప్రధాన ఉద్దేశమని ప్రధాని అన్నారు. అది కేవలం తమ కోసమే కాకుండా.. మొత్తం మానవాళి కోసం కూడా అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి 'ఆత్మనిర్భర్ భారత్' మంచి చేస్తుందని విశ్వసిస్తున్నానని తెలిపారు.
తమిళనాడు తిరుచిరాపల్లిలోని రామకృష్ణ తపోవన్ ఆశ్రమ స్థాపకుడైన స్వామి చిద్భవానందజీ.. ఇప్పటివరకు 186 పుస్తకాలను రచించారు.
ఇదీ చూడండి:'మోదీ పాలన ముగిసే వరకు పోరు ఆగదు'