మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ రైతులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథక నిధులు 18వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు మోదీ. దీనితో దాదాపు 9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లాభాల గురించి మాట్లాడతారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సమావేశం జరిగిన తర్వాత నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.
కేంద్ర మంత్రులు కూడా..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు వేర్వేరు రాష్ట్రాల నుంచి మోదీ ప్రసంగాన్ని విననున్నారు.
కోటి మంది లక్ష్యంగా..
ప్రధాని కార్యక్రమంలో మొత్తం కోటి మంది రైతులు పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేస్తోంది భాజపా. దేశవ్యాప్తంగా 19 వేలకుపైగా అవగాహనా కార్యక్రమాలను చేపట్టి కోటిమందికిపైగా రైతులను సమీకరించడానికి నిర్ణయించింది. ఎక్కువ మంది హాజరయ్యేలా చూడాల్సిందిగా భాజపా అధిష్ఠానం.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్షేతస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది.
పీఎం కిసాన్..
పీఎం- కిసాన్ పథకంలో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారు రైతులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందిస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని 4 నెలలకు ఒకసారి చొప్పున మూడు సమాన కిస్తీలలో 2 వేల రూపాయల వంతున చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు.
ప్రభుత్వం సిద్ధం..
ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాసిన లేఖను రైతులంతా చదవాలని ప్రధాని కోరారు. గతవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో రైతులతో ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు రైతులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమే'