కరోనా విజృంభణ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మార్చి 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్‌లో ప్రధాని పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుల్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొననుండటం సహా భారత్-బంగ్లా మధ్య స్నేహబంధం ఏర్పడి యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని పర్యటన ప్రత్యేకంగా నిలవనుందని పేర్కొంది.
మోదీ చివరిసారి.. 2015లో బంగ్లాదేశ్ వెళ్లారు. ఆరేళ్ల అనంతరం తాజాగా ఆ దేశంలో పర్యటించనున్నారు. మోదీ తన పర్యటనలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశమై ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలానే బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ హమీద్‌తోనూ ప్రధాని భేటీ అవుతారని పేర్కొంది. ఇరుదేశాల ప్రధానమంత్రులు చివరిగా గతేడాది డిసెంబర్‌లో వర్చువల్‌గా సమావేశమయ్యారు.
'బంగబంధు' భారతీయులకు హీరోనే..
బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుల్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా భారత ప్రధాని మోదీ బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయులకు కూడా ఆయన ఓ హీరో అని మోదీ కొనియాడారు.
"మానవహక్కులు, స్వేచ్ఛ కోసం ఎంతో కృషి చేసిన 'బంగబంధు'కు నా హృదయ పూర్వక నివాళులు. షేక్ ముజిబుల్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెలాఖరున బంగ్లాదేశ్‌కు వెళ్లనుండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా" అని ట్వీట్ చేశారు మోదీ.
విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా షేక్ ముజిబుల్ రెహ్మాన్‌కు నివాళులర్పించారు.
ఇదీ చదవండి:అనుసంధానం యుగంలో సమైక్యతే కొండంత అండ