వరల్డ్ ఎకనామిక్ ఫోరం శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించనున్నారు. భారత్లో సంస్కరణలు, పెరిగిన సాంకేతికత వినియోగం సహా విస్తృతమైన అంశాలపై మాట్లాడనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు 'దావోస్ అజెండా' సమావేశంలో ప్రసంగించనున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
జనవరి 28న 'దావోస్ డైలాగ్' సమావేశంలో మోదీ పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రపంచంలోని ఉత్తమ పరిశ్రమ వర్గాలు ఇందుకు హాజరవుతారని పేర్కొంది. 'నాల్గో పారిశ్రామిక విప్లవం- మానవుల శ్రేయస్సుకు సాంకేతిక ఉపయోగం' అనే అంశంపై మోదీ ప్రసంగిస్తారని వెల్లడించింది. వివిధ సంస్థల సీఈఓలతోనూ వర్చువల్గా భేటీ అవుతారని తెలిపింది.
'దావోస్ అజెండా' పేరుతో ఈ సమావేశాలు నిర్వహిస్తోంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. భారీ స్థాయిలో జరుగుతున్న సదస్సులో మొత్తం వెయ్యి మంది వివిధ దేశాల నేతలు, కంపెనీల సీఈఓలు, ఛైర్మన్లు, ప్రపంచస్థాయి సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సంబంధిత విషయాలతో పాటు కరోనా తర్వాత ఎదురయ్యే సామాజిక, సాంకేతిక సవాళ్లపై వీరంతా చర్చిస్తున్నారు.
ఎన్సీసీ ర్యాలీకి మోదీ
మరోవైపు, దిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగే ఎన్సీసీ ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హాజరుకానున్నట్లు పీఎంఓ తెలిపింది.