బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ లోకల్, నాన్‌లోకల్ అంశంపై అధికార టీఎంసీ, భాజపా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. వందేమాతర గేయంతో దేశప్రజలను సంఘటింత చేసిన ఘనత బంగాల్దని.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం కొందరు 'బయటివ్యక్తులు' అని సంబోధించడమేంటని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే బంగాల్లో గడ్డపై జన్మించిన వారే ముఖ్యమంత్రి అవుతారని హామీ ఇచ్చారు.
తూర్పు మెదినీపుర్ జిల్లా కాంతిలో జరిగిన భాజపా ప్రచార సభలో మోదీ ఈ విధంగా మాట్లాడారు. రవీంద్ర నాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి వీరులు పుట్టిన గడ్డ అని బంగాల్‌ను అభివర్ణించారు. ఇలాంటి బంగాల్లో ఉన్న భారతీయుడు బయటివ్యక్తి ఎలా అవుతాడని వ్యాఖ్యానించారు. భాజపా నేతలను ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే పర్యటకులని దీదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
భాజపా అధికారంలోకి వస్తే స్కాం-ఫ్రీ పథకాలు అమలవుతాయని టీఎంసీపై విమర్శలు గుప్పించారు మోదీ. అంపన్ తుఫాన్ బాధితులకు కేంద్రం చేసిన ఆర్థిక సాయాన్ని దీదీ సర్కారు స్వలాభం కోసం ఉపయోగించుకుందని అన్నారు. మే 2 బంగాల్లో టీఎంసీకి చివరి రోజు అవుతుందని ఉద్ఘాటించారు.
'వారే బయటివ్యక్తులు'
బంగాల్లో నివసించేవారు బయటివ్యక్తులు కాదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బంగాల్లో కలహాలు సృష్టించే వారే 'ఔట్‌సైడర్స్' అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ మొదలైన రాష్ట్రాల నుంచి వచ్చి బంగాల్లో అల్లర్లు సృష్టించేవారిని మూర్ఖులుగానే అభివర్ణిస్తామని అన్నారు. వారిని అలా పిలిచేందుకు అస్సలు మొహమాటపడమని తెలిపారు. బంగాల్ ఎన్నికల ప్రచార సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఆమె... నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు.
ఉన్నఫళంగా పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు ఎందుకు పెరిగాయని దీదీ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల వేస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. రైతులు కొన్ని నెలలుగా ఉద్యమం చేస్తున్నా మోదీ, అమిత్ షా మౌనం వహిస్తున్నారేంటని మండిపడ్డారు.