ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేడు(ఆదివారం) భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం కానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన నిర్వహిస్తోన్న ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
దిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుందని భాజపా ప్రకటించింది. ప్రధాని మోదీ సమావేశాన్ని ప్రారంభించి.. పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపింది.
ఈ సందర్భంగా సమావేశంపై కీలక విషయాలు వెల్లడించారు ఝార్ఖండ్ భాజపా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ దీపక్ ప్రకాశ్.
" ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పార్టీ వ్యూహాన్ని జాతీయ స్థాయి నాయకత్వం నిర్ణయించనుంది. ఝార్ఖండ్లో భాజపా కార్యకలాపాలపై ఈ సమావేశంలో వివరించనున్నాం. మా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ నాయకత్వం సూచనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం. "
- దీపక్ ప్రకాశ్, రాజ్యసభ ఎంపీ
అయితే.. కరోనా మహమ్మారి అనంతరం భాజపా కార్యవర్గం తొలిసారి భౌతికంగా సమావేశం అవుతోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర జాతీయ స్థాయి నేతలు, రాష్ట్రాల అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఇదీ చూడండి: మోదీ.. పాత కథల్లోని అహంకార రాజు: ప్రియాంక