PM Modi Speech at Karimnagar Public Meeting : కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. చరిత్రలోని 16 మహా జనపదాల్లో అస్మక జనపదం ఈ ప్రాంతమని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ప్రజలు గతంలోనే ఫామ్‌హౌస్ సీఎంకు ట్రైలర్ చూపించారని.. ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తొలి ముఖ్యమంత్రి బీసీయే అవుతారని పునరుద్ఘాటించారు.
BJP Public Meeting in Karimnagar : ప్రస్తుతం తెలంగాణ వయస్సు పదేళ్లని.. వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని మోదీ పేర్కొన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలోనే నంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో మార్పు గాలి వీస్తోందని.. మార్పు తథ్యమని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను ఓడిస్తారని.. కాంగ్రెస్‌ను గెలవనీయరని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలను మోసం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వదిలిపెట్టలేదన్న ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పీఎఫ్‌ఐ వంటి తీవ్రవాద సంస్థలకు ఊతం లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంధవిశ్వాసాలను నమ్మే సీఎం మనకు అవసరమా - తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది : ప్రధాని మోదీ
తెలంగాణలో మార్పు గాలి వీస్తోంది.. మార్పు తథ్యం. ప్రజలు బీఆర్ఎస్ను ఓడిస్తారు.. కాంగ్రెస్‌నూ గెలవనీయరు. ప్రజలను మోసం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ ఆ రెండు పార్టీలు వదిలిపెట్టలేదు. ప్రస్తుతం తెలంగాణ వయస్సు పదేళ్లు. వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్తుకు కీలకం. తెలంగాణ వచ్చే ఐదేళ్లలో దేశంలోనే నంబర్ వన్ కావాలి. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటు వేయాలి. - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతుందని మోదీ పేర్కొన్నారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రయత్నించామని.. అయితే ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుందని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ చేసిన రూ.లక్ష కోట్ల దోపిడీ దేశమంతటికీ తెలుసన్న ప్రధాని.. రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అవినీతి చేసుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా..? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు బదులు కేసీఆర్ కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను అస్సలు నమ్మొద్దని.. బీజేపీని, మోదీని నమ్మాలన్నారు. ఒక రోగానికి విరుగుడు మరో రోగం కాదన్న ఆయన.. ఇరిగేషన్ స్కామ్ దోషులను జైలుకు పంపాలన్నా, కేసీఆర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలన్నా బీజేపీకే ఓటేయాలని కోరారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ను పసుపు నగరంగా ప్రకటిస్తాం : నరేంద్ర మోదీ
బీఆర్ఎస్ మునిగే నావ అని వారికి కూడా అర్థమైంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలవడానికి కుటుంబ సభ్యులందరూ అష్టకష్టాలు పడుతున్నారు. డిసెంబర్ 3న బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. లిక్కర్ కుంభకోణంపై విచారణ వేగవంతం అవుతుంది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుంటుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ విధ్వంసం మొదలవుతుంది. రాబోయే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి మరింత వేగం అవుతుంది. కమలం పువ్వుపై వేసే ఒక్కో ఓటు నాలో శక్తిని మరింత పెంచుతుంది. - ప్రధాని మోదీ
ప్రజలను కలవని సీఎం, సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? : మోదీ