PM Modi Shahdol Visit : విపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల కోసమని ఫేక్ గ్యారెంటీలతో కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని సెటైర్లు వేశారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.
'రాజకీయంగా తమకే గ్యారెంటీ లేని కొన్ని పార్టీలు కొత్త పథకాలు, ఫేక్ గ్యారెంటీలతో సిద్ధమవుతున్నాయి. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి. అసత్య వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని కుటుంబ పార్టీలు ఒక్కటవుతున్నాయి.' అని విమర్శించారు. ఇప్పటికే ఇచ్చిన ఎన్నికల హామీలను ఆయా పార్టీలు అమలు చేయలేదని గుర్తుచేశారు. ఒకప్పుడు పరస్పరం తిట్టుకున్న పార్టీలన్నీ ఇప్పుడు పట్నా వేదికగా ఒక్కటయ్యాయని విమర్శించారు. వారి ఐక్యతకూ గ్యారెంటీ లేదని విమర్శించారు. హామీల విషయంలో బీజేపీ మాత్రం అందుకు విపక్ష పార్టీలకు భిన్నమని మోదీ తెలిపారు. హామీ ఇస్తే అమలు చేసి తీరుతుందన్నారు. పేదలకు రూ.5 లక్షలకు వరకు ఉచిత వైద్యం అని హామీ ఇవ్వడమే కాకుండా దాన్ని చేసి చూపించామని అన్నారు. స్వతంత్ర భారతంలో ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదన్నారు.'
షాడోల్‌లో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనకు సంబంధించిన పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్వహణ మార్గదర్శకాలతో పాటు పర్యవేక్షణకు సంబంధించిన మాడ్యూళ్లను మోదీ విడుదల చేశారు. 2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల డిజిటల్ ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన మోదీ కొందరి లబ్ధిదారులకు స్వయంగా కార్డులను అందించారు. రాణి దుర్గావతి 500వ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించడంతో పాటు ఆమె జ్ఞాపకార్థం స్టాంపులను విడుదల చేస్తామని తెలిపారు.
'ధరల పెరుగుదలకు మోదీ విధానాలే కారణం'
ధరల పెరుగుదలకు ప్రధాని మోదీ విధానాలే కారణమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నోట్ల రద్దు వల్ల దేశంలో అవినీతి, తీవ్రవాద కార్యకలాపాలు తగ్గాయా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ముంబయిలో ఉన్న స్నేహితునికి రూ.34 వేల కోట్లు, గుజరాత్‌లో ఉన్న వ్యాపారవేత్తకు రూ. 22 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేశారని ఆరోపించారు. ద్రవ్యోల్బణం వెనక దేవుడేమి లేడని కేజ్రీవాల్ అన్నారు. నిత్యావసరాలైన బియ్యం, పాలు వంటి మీద పన్నులు వేసి దేశంలో బహిరంగ దోపిడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ పాలనలో కూడా ప్రజలు ఇంత దోపిడికి గురి కాలేదని దుయ్యబట్టారు. పెట్రోల్ రిటైల్ మార్కెట్‌లో 57 రూపాయలకు లభిస్తుండగా వివిధ రకాల పన్నులు మోపి 100 రూపాయలకు చేర్చారని కేజ్రీవాల్ అన్నారు