కేంద్ర నౌకాయాన శాఖ పేరును మార్చుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. దీనిని నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వశాఖ(మినిస్టరీ ఆప్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్)గా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. గుజరాత్లోని హజీరా(సూరత్) నుంచి ఘోఘా(భావ్నగర్ జిల్లా) వరకు రో-పాక్స్ నౌక సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 'ఆత్మనిర్భర్' భారత్‌లో భాగంగా ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న మోదీ.. దేశంలోని సముద్రతీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసే చర్యల్లో భాగంగా నౌకాయాన శాఖను విస్తరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొత్తగా పోర్టులు, జలమార్గాలను కూడా దీని పరిధిలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ రెండింటికి సంబంధించిన చాలా పనిని నౌకాయాన మంత్రిత్వ శాఖే నిర్వహిస్తోందని.. అందుకే పేరులో స్పష్టత ఉంటే చేసే పనిలోనూ స్పష్టత ఉంటుందనే ఉద్దేశంతోనే శాఖ పేరును మారుస్తున్నట్లు మోదీ వెల్లడించారు.
రో-పాక్స్ నౌక ప్రత్యేకతలివి..
- హజీరా-ఘోఘా రోడ్డు మార్గం 370 కిలోమీటర్లు కాగా.. సముద్ర మార్గంలో రో-పాక్స్ నౌకాయానం ద్వారా అది 90 కి.మీ.లకు తగ్గుతుంది. 4 గంటల సమయం ఆదా అవుతుంది.
- 3 అంతస్తుల్లో ఉండే ఈ నౌక ఒక విడతలో 500 మంది ప్రయాణికులను తీసుకెళుతుంది.
- ఈ నౌకలో 30 ట్రక్కులు, 100 కార్లను రవాణా చేయగలిగేంత చోటు ఉంటుంది. రోజుకు 3 ట్రిప్పులు నడుపుతారు.
రో-పాక్స్ నౌక సేవల ద్వారా ప్రజలకు సమయం, వ్యయం కలిసొస్తాయని, రోడ్డు మార్గాల్లో ఉండే ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు తగ్గిపోతాయని వివరించారు మోదీ.