వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిన నేపథ్యంలో 'పంట కోతల అనంతర'(Post harvest revolution) విప్లవం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కొవిడ్ వంటి అసాధారణ పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించారంటూ రైతులను ప్రశంసించారు. ఈ మేరకు నాబార్డ్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ తన సందేశాన్ని పంపించారు.
"ఎప్పుడూ లేనంతగా వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల నమోదైన నేపథ్యంలో పంట కోతల అనంతరం విప్లవం రావాల్సిన అవసరం ఉంది. దీన్ని సాధించేందుకు అవిశ్రాంత వేగంతో పనిచేస్తున్నాం. సాగునీటి పారుదల నుంచి విత్తులు, పంట కోతలు, సాంకేతికతతో కూడిన ఆదాయం వరకు అన్ని సమస్యల పరిష్కారం కోసం సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఆత్మనిర్భర్ భారత్ కోసం స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థికవ్యవస్థ అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకోసం ఏడేళ్ల నుంచి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. యువతను, వ్యవసాయ ఆధారిత అంకురాలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని 12 కోట్ల చిన్న రైతులకు సాధికారత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వీరిని చోదక శక్తిగా మార్చుతామని పునరుద్ఘాటించారు.
పంట కోతల అనంతర విప్లవం అంటే.. పంటలు కోత తర్వాత ఎలాంటి జాప్యం జరగకుండా, వాటిలోని తేమ, పోషకాలు క్షీణించేలోపు వాటిని వినియోగంలోకి తేవటమే. అందుకు తగిన సదుపాయాలు అవసరం. ఆహార శుద్ధి కర్మాగారాలు అందుబాటులో ఉన్న సమయంలో అది సాధ్యమవుతుంది. దీని ద్వారా పోషకాలు నిండిన, తాజా ఆహార పదార్థాలు వినియోగదారులకు చేరుతాయి.
ఇదీ చదవండి: ఉత్తర భారతంలో పిడుగుల బీభత్సం.. 68 మంది మృతి