modi putin meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య నేడు (సోమవారం) ద్వైపాక్షిక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా కీలకమైన రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సదస్సు ఈ సాయంత్రం ఐదున్నర గంటలకు జరగనుంది. రాత్రి తొమిదిన్నర గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన విదేశాంగ, రక్షణ మంత్రుల స్థాయి 2+2 తొలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో అఫ్గానిస్థాన్ పరిస్థితులపై దృష్టి సారించటం సహా లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ల నుంచి పెరుగుతున్న ఉగ్రవాద ముప్పుపై చర్చించనున్నారు. ఈ సదస్సు తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సీమాంతర ఉగ్రవాదం, అఫ్ఘాన్ సంక్షోభంతో ఏర్పడే భద్రతా సమస్యలను సంయుక్త ప్రకటనలో చేర్చనున్నట్లు తెలుస్తోంది.
russia-india defence deal: పుతిన్ ఒకరోజు పర్యటనలో భాగంగా భారత్‌లో ఏకే 203 రైఫిళ్ల తయారీకి సంబంధించి రూ.5100 కోట్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయుధ వ్యవస్థను భారత్‌కు తరలించడానికి గుర్తుగా ఆయన.. ఎస్ 400 మోడల్‌ను మోదీకి అందజేస్తారని సమాచారం.
ఇదీ చూడండి: నాగాలాండ్ కాల్పుల్లో 14కు చేరిన మృతుల సంఖ్య- హై అలర్ట్!