స్వాతంత్ర్యం తర్వాత నిర్లక్ష్యానికి గురైన ఖాదీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రేరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఖాదీ దారం స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి తీరంలో నిర్వహించిన ఖాదీ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 7,500 మంది మహిళలు ఒకేచోట ఒకేసారి చరఖాతిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు.
మహిళలతో కలిసి చరఖా తిప్పిన ప్రధాని మోదీ.. తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత ఖాదీని నిర్లక్ష్యం చేయటం వల్ల దేశవ్యాప్తంగా ఖాదీ గ్రామోద్యోగులు ఇబ్బందుల పాలయ్యారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ తెలిపారు.
"ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ అందులో ఖాదీ పరివర్తన సంకల్పాన్ని జోడించాం. గుజరాత్ విజయగాథను దేశమంతా విస్తరింపజేయటం ప్రారంభించాం. ఖాదీకి సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించాం. ఖాదీ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించాం. ఆ ఫలితాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది. దేశంలోని టాప్ ఫ్యాషన్ బ్రాండ్లన్నీ ఖాదీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
అటల్ వంతెన ప్రారంభం
అనంతరం అహ్మదాబాద్‌లో సబర్మతి నదిపై నిర్మించిన అటల్ పాదాచారుల వంతెనను మోదీ ప్రారంభించారు. అటల్ వంతెన డిజైన్ అద్భుతమని కొనియాడారు. గుజరాత్లో ఫేమస్ అయిన కైట్ ఫెస్టివల్‌ను ప్రతిబింబించేలా ఈ వంతెన ఉందని అన్నారు.