PM Modi on Food Supply: అన్నపూర్ణాదేవి అవతారమెత్తి ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేసేందుకు భారతావని సిద్ధంగా ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నుంచి అనుమతులు లభించిన వెంటనే ఆ పనిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సోమవారం జరిపిన చర్చల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.
గుజరాత్‌లోని శ్రీ అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్‌కు చెందిన విద్యాకేంద్ర సముదాయం, బాలుర వసతిగృహాన్ని మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ.. "ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. దారులన్నీ మూసుకుపోతుండటం వల్ల పెట్రోల్, డీజిల్, ఎరువుల సముపార్జన కష్టమవుతోంది. ఆహార నిల్వలు ఖాళీ అవుతుండటం వల్ల కొత్త సమస్య ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేసేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది. బైడెన్‌తో భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించా" అని పేర్కొన్నారు. కొవిడ్ సంక్షోభంలోనూ భారత్ 8ం కోట్ల మందికి ఉచిత రేషన్ అందించిందని గుర్తు చేశారు. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని కొనియాడారు.
ఇదీ చదవండి: 'భాజపా బుల్డోజర్లు విద్వేశపూరితమైనవి'