Modi Interact CM's: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గతేడాది నవంబర్ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు. అలా చేయడం ద్వారా తాము అందించిన ప్రయోజనాలు క్షేతస్థాయిలోని ప్రజల వరకు వెళ్లడం లేదన్నారు మోదీ. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు మోదీ. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు మోదీ. ఇలా చేయడం మంచిది కాదన్నారు. ఒక రాష్ట్రం ధరలు తగ్గించకపోవడం వల్ల.. ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా పడుతుందన్నారు మోదీ.
"మహారాష్ట్ర, బంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు.. కొన్ని కారణాల వల్ల.. ఈ విషయంలో కేంద్రం మాట వినడం లేదు. అలా చేయడం వల్ల ప్రజలపై భారం పడుతోంది. నవంబర్‌లో చేయాల్సిన వ్యాట్ తగ్గింపు పనిని.. ఇప్పుడైనా చేయాలని కోరుతున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు'
దేశంలో కరోనా పరిస్థితులపై మాట్లాడిన మోదీ.. పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. అర్హత ఉన్న పిల్లలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పిల్లలకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలన్నారు. టీకాపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మోదీ. కేసుల పెరుగుదలతో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనే విషయం స్పష్టమైందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను దేశంలో మెరుగ్గా అదుపు చేయగలిగామని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మనం అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దేశంలో దాదాపు 96 శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ వేసుకున్నారని, ఇది గర్వించదగ్గ విషయం అన్నారు ప్రధాని. జాతీయ, ప్రపంచ పరిస్థితులను శాస్త్రవేత్తలు, నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.