Bio CNG plant in Indore: మధ్యప్రదేశ్ ఇందోర్‌లో ఆసియాలోనే అతిపెద్ద గోబర్-ధన్ (బయో సీఎన్‌జీ) ప్లాంట్‌ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యర్థ రహిత నగరాల నిర్మాణమే లక్ష్యంగా 550 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌ను వర్చువల్‌గా వేదికగా ప్రారంభించారు. వ్యర్థాలతో సంపద సృష్టిలో భాగంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి గోవర్ధన్ ప్లాంట్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. కాలుష్య నివారణలో బయో సీఎన్‌జీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీకి దోహదపడుతుందన్నారు.
"దశాబ్దాలుగా వేలాది ఎకరాల్లో లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీని వల్ల గాలి, నీరు కలుషితమై వ్యాధులు వ్యాప్తికి కారణమవుతోంది" అని మోదీ పేర్కొన్నారు. అందుకే స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశలో ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఏడేనిమిదేళ్ల కిందట పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం 1-2 శాతం మాత్రమే ఉండేదని.. అది ఇప్పుడు 8 శాతానికి చేరుకుందని ప్రధాని వెల్లడించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ల్లో వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించాలని బడ్జెట్‌లో నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. తద్వారా రైతుల కష్టాలు తొలగుతాయని.. వారికి అదనపు ఆదాయం కూడా లభిస్తుందన్నారు.
ఇందోర్ పరిశుభ్రతకు మారు పేరుగా మారిందన్న మోదీ.. ఇందుకు ప్రజలకు కీలక పాత్ర పోషించారని, నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. దీంతో వరుసగా ఐదుసార్లు స్వచ్ఛమైన నగరంగా అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
ప్రయోజనాలు..
- ఈ ప్లాంట్‌ను రోజుకు 550 టన్నుల తడి సేంద్రీయ వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యంతో నిర్మించారు. ఇది రోజుకు 17,000 కిలోల సీఎన్‌జీని, 100 టన్నుల సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తుందని పీఎంఓ తెలిపింది.
- ఈ ప్లాంట్.. జీరో-ల్యాండ్‌ఫిల్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది బహుళ పర్యావరణ ప్రయోజనాలను ఇస్తుంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. గ్రీన్ ఎనర్జీని అందిస్తుంది.
ఇదీ చూడండి: భారత్‌పై మళ్లీ దావూద్ గురి.. దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర..