జమ్ముకశ్మీర్లో జరిగిన నగ్రోటా ఎన్కౌంటర్, తదనంతర పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ సమీపంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రధాని చర్చించినట్లు సమాచారం.
26/11 ముంబయి దాడుల స్మృతి నేపథ్యంలో భారీ పన్నాగానికి ఉగ్రవాదులు పూనుకున్నట్లు నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై మోదీ ఈ భేటీ నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి, ఉన్నత స్థాయి నిఘా విభాగం అధికారులు పాల్గొన్నారు.
నగ్రోటా ఘటనలో అధికారుల పనితీరును ప్రశంసిస్తూ సమీక్ష అనంతరం మోదీ ట్వీట్ చేశారు.
"నగ్రోటాలో హతమైన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి లభించటం చూస్తే.. ఏదో పెద్ద విధ్యంసానికే ప్రణాళిక వేసినట్లు ఉన్నారు. జమ్ముకశ్మీర్ స్థానిక ఎన్నికలను లక్ష్యంగా చేసిన కుట్రను బలగాలు భగ్నం చేశాయి. మన భద్రతా బలగాలు మరోసారి ధైర్యంతోపాటు వృత్తి ధర్మాన్ని సమర్థంగా ప్రదర్శించాయి. వారి అప్రమత్తతకు కృతజ్ఞతలు."
- ప్రధాని నరేంద్రమోదీ
భారీగా ఆయుధాలు..
నగ్రోటాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు జైషే మహమ్మద్ సంస్థకు చెందినట్లు అనుమానిస్తున్నారు. వీరి వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఎన్కౌంటర్ తర్వాత వీరంతా ఏదో భారీ స్థాయిలో ఉగ్రదాడికి ప్రయత్నాల్లో ఉన్నారని జమ్ము ఐజీపీ వెల్లడించారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో ఎన్కౌంటర్- నలుగురు ముష్కరులు హతం