బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫోన్లో బుధవారం మాట్లాడారు. బంగాల్లో వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
"బంగాల్లో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని ఎదుర్కోనేందుకు.. కేంద్ర నుంచి సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు."
-ప్రధాన మంత్రి కార్యాలయం.
హావ్డా జిల్లాలోని ఉదయ్నారాయణ్పుర్లో వరద ప్రభావిత ప్రాంతాలను మమత సందర్శిస్తున్న మోదీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఓ అధికారి తెలిపారు. వరదల పరిస్థితిపై కేంద్రానికి నివేదికను అందజేస్తామని మోదీతో దీది చెప్పినట్లు పేర్కొన్నారు.



బంగాల్లో వరదల ధాటికి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు దామోదర్ లోయ ప్రాంతంలోని ఆనకట్టల నుంచి పోటెత్తిన వరదల కారణంగా ఆరు జిల్లాలకు చెందిన 3 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.
పరిహారం..
బంగాల్లో వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల పరిహారాన్ని అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. గాయపడ్డవారికి రూ.50,000 ఇవ్వనున్నట్లు చెప్పింది.
ఇదీ చూడండి: అధ్వానంగా రోడ్లు.. సంగీతంతో సందేశం
ఇదీ చూడండి: హత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా రాహుల్!