బంగాల్‌లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అవకాశం దొరికినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆరోపిస్తోంది. తాజాగా నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టిన తృణమూల్.. ఆయనను 'జేమ్స్ బాండ్ 007' (Modi james Bond 007) అభివర్ణించింది. గడిచిన ఏడేళ్ల మోదీ హయాంలో దేశంలో అభివృద్ధి, ఆర్థిక ప్రగతి క్షీణించాయని.. ఆర్థిక వ్యవస్థను కూడా అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్నారని దుయ్యబట్టింది. (Modi james Bond 007)
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాజపా, తృణమూల్ మధ్య హోరాహోరిగా మాటల యుద్ధం కొనసాగింది. తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ తాజాగా సామాజిక మాధ్యమాన్ని వేదికగా మలుచుకుంది. జేమ్స్ బాండ్ రూపంలో నరేంద్ర మోదీ ఉన్న 'మీమ్'ను తృణమూల్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ (Derek O'Brien on Modi) సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. 'దె కాల్ మీ 007' అనే క్యాప్షన్ ఉన్న మీమ్‌లో.. 007 అంటే '0 అభివృద్ధి, 0 ఆర్థిక ప్రగతి, 7 ఏళ్లుగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదు' అంటూ వివరించారు. తాజాగా ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (Modi james Bond 007)
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే ఉంది. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి నిర్ణయాలను తీవ్రంగా విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ స్థానికతను అస్త్రంగా మలుచుకున్న తృణమూల్.. బయట వ్యక్తులకు అవకాశం ఇవ్వదంటూ ప్రచారం చేసింది. తాజాగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది.
ఇదీ చదవండి: డ్రగ్స్‌కు ముడిపెడుతూ రాహుల్‌పై భాజపా నేత తీవ్ర ఆరోపణలు