PM Modi addresses farmers: ప్రకృతి సేద్యం విధానాలను జీవితంలో భాగం చేసుకుని, భూమాతకు సేవ చేయాలని గుజరాత్ రైతులకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తక్కువ సమయంలో, అధిక దిగుబడి కోసం రైతులు రసాయనాలు, ఎరువులవైపు చూస్తున్నారు కానీ.. భూమాతను సంరక్షించుకోవడం లేదన్నారు. ఫలితంగా భూసారం విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గుజరాత్లో మూడు రోజుల పాటు జరిగిన ఉమియా మాత ఆలయ శంకుస్థాపన వేడుకల ముగింపు కార్యక్రమానికి వీడియో సందేశాన్ని పంపించారు మోదీ. ఈ సందర్భంగా.. ప్రకృతి సేద్యంపై మాట్లాడారు.
"ఉమియా మాతకు సేవ చేస్తున్న మీరు.. భూమాతను విస్మరించుకూడదని నేను కోరుతున్నాను. ఉమియా మాత బిడ్డలకు.. భూమాతను మర్చిపోయే హక్కు లేదు. మనకు వాళ్లిద్దరూ ఒకరే. అందుకే.. ఉత్తర గుజరాత్‌ను ప్రకృతి సేద్యంవైపు నడిపిస్తామని.. ఉమియా మాత సాక్షిగా మీరు ప్రమాణం చేయాలని కోరుతున్నాను. ప్రకృతి వ్యవసాయం అంటే.. జీరో బడ్జెట్ ఫార్మింగ్. మీ భూముల్లో కొంత భాగాన్ని దీనికి కేటాయించండి. అలా ఎప్పటికప్పుడు పెంచుకోండి. దీనితో ఖర్చులు తగ్గుతాయి. భూమాతపై గౌరవం పెరుగుతుంది. రానున్న తరాలకు మంచి చేస్తున్నట్టు అవుతుంది. ఉమియా మాత ఆశీస్సులతో.. మీరందరూ ప్రకృతి సేద్యాన్ని అర్థం చేసుకుని, స్వీకరించి ముందుకు నడుస్తారని ఆశిస్తున్నా."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
Pm Modi Gujarat farmers: ఉమియా మాత.. ఉత్తర గుజరాత్‌లోని పటేదార్ రైతు సంఘాల కులదైవం. ఉమియా మాతకు ఆలయాన్ని నిర్మించేందుకు వారు తీసుకున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. నీటి సంరక్షణపై గతంలో తాను చేసిన విజ్ఞప్తిని రైతులు ఆచరించారని హర్షం వ్యక్తం చేసిన ఆయన.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి:- 'కాశీ కారిడార్.. దేశ సనాతన సంస్కృతికి ప్రతీక'