కరోనా(Covid-19) రెండో దశ విజృంభణ సమయంలో.. వివిధ రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో సవాళ్లు ఎదురయ్యాయని మోదీ పేర్కొన్నారు. కానీ, ఆ సమయంలో భారత వాయుసేన, రైల్వే శాఖలు, క్రయోజనిక్ ట్యాంకర్ డ్రైవర్లు తీవ్రంగా శ్రమించి సమయానికి ఆక్సిజన్‌ను చేరవేయగలిగారని చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్‌కీ బాత్(Mann Ki Baat) కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' సూత్రాన్ని పాటిస్తూ దేశం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడు వసంతాలను పూర్తి చేసుకుని, ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"సాధారణ రోజుల్లో దేశంలో రోజువారీ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి 900 మెట్రిక్ టన్నులుగా ఉండేది. ప్రస్తుతం అది పది రెట్లు పెరిగి దాదాపు 9,500 మెట్రిక్ టన్నులకు చేరింది. కరోనా మొదటి దశను సమర్థంగా ఎదుర్కొన్నాం. అదే స్ఫూర్తితో ఈ రెండో దశనూ ఎదుర్కొందాం."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి,
వారికి సెల్యూట్..
యాస్, తౌక్టే తుపాను వేళలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయటం వల్ల గతంలో కంటే మరణాల సంఖ్య తగ్గిందని మోదీ చెప్పారు. విపత్తు వేళలో.. తుపాను(Cyclone) ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు ఓపిక, క్రమశిక్షణతో ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు.
"పదిరోజుల వ్యవధిలో తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాలు రెండు తుపాన్లను ఎదుర్కొన్నాయి. పశ్చిమ తీరాన్ని 'తౌక్టే' తుపాను కుదిపేయగా.. తూర్పు తీరంలో 'యాస్' తుపాను బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో రాష్ట్రాలు, కేంద్రం కలిసి పని చేశాయి. ఫలితంగా గతంలో కంటే తక్కువ ప్రాణనష్టం జరిగింది. ఈ విపత్కర సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి సెల్యూట్ చేస్తున్నాను. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. ఈ విచారకర సమయంలో వారి వెన్నంటే మనం నిల్చోవాలి.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: ఈసారీ కరోనా మధ్యే మోదీ 2.0 వార్షికోత్సవం
ఇదీ చూడండి: COVID: మోదీ పనితీరుపై 63% మంది విశ్వాసం!