కరోనా వ్యాక్సిన్ కోసం యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో శనివారం కీలక పర్యటన చేపట్టనున్నారు మోదీ. భారత్‌లో కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న సీరం, జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ సంస్థలను సందర్శించనున్నారు. వ్యాక్సిన్ పనితీరు, ఉత్పత్తి, పంపిణీకి ఏర్పాట్లు వంటి అంశాలను స్వయంగా సమీక్షించనున్నారు.
మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనాపై పోరులో భారత్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న తరుణంలో వ్యాక్సిన్ సన్నద్ధతపై శాస్త్రవేత్తలతో చర్చించేందుకు మోదీ ఈ పర్యటన చేపడుతున్నారని పేర్కొంది. టీకా అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను సమీక్షిస్తారని పేర్కొంది.
మొదట జైడస్..
పర్యటనలో భాగంగా మొదట గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ప్లాంట్‌ను సందర్శిస్తారు మోదీ. అహ్మదాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛంగోదర్ పారిశ్రామిక ప్రాంతానికి శనివారం ఉదయం 9:30 గంటలకు చేరుకుంటారు.
జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న 'ZyCoV-D' టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. ఆగస్టులో మొదటి దశ ప్రయోగాలు పూర్తయ్యాయి.
సీరం సందర్శన..
సీరం సంస్థను సందర్శించేందుకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు పుణె చేరుకుంటారు ప్రధాని. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, పంపిణీకీ సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీస్తారు.
సీరం సంస్థ తయారు చేస్తున్న ఈ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. మూడో దశ ట్రయల్స్ కోసం అధికారిక ప్రక్రియ పూర్తయింది. ఐసీఎంఆర్‌తో కలిసి దేశవ్యాప్తంగా 15 నగరాల్లో 1600మంది వలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించేందుకు సీరం సంస్థ సిద్ధమైంది. వచ్చే ఏడాది మొదటి వరకు ఈ టీకా అందుబాటులోకి వస్తుందని అంచనాలున్నాయి. ఆరోగ్య సిబ్బంది, సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ టీకా రెండు డోసులకు కలిపి ధర గరిష్ఠంగా రూ.1000 ఉంటుందని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ఇప్పటికే తెలిపారు. 2024 నాటికి దేశంలోని ప్రతిఒక్కరికీ టీకా చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్ బయోటెక్‌కు..
పుణె నుంచి హైదరాబాద్‌కు మధ్యాహ్నం చేరుకుంటారు మోదీ. భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' టీకా అభివృద్ధి కేంద్రాన్ని సందర్శిస్తారు. గంటపాటు అక్కడే ఉండి వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం దిల్లీకి బయలుదేరుతారు.
కొవాగ్జిన్ టీకాపై ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి.
పర్యటన సందర్భంగా వ్యాక్సిన్‌కు సంబంధించి మోదీ కీలక ప్రకటన చేస్తారేమోనని సరత్వా ఆసక్తి నెలకొంది.