దివ్యాంగుల జీవితంలో సానుకూల మార్పు కోసం భారత్ అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారికి అవకాశాలు కల్పించటం, వాటిని పొందే మార్గాన్ని మెరుగుపరచటానికి అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి.. ఈఏడాది " మంచి స్థానానికి తిరిగి చేరుకోవటం: దివ్యాంగులను కలుపుకొని కొవిడ్ అనంతరం స్థిరమైన ప్రపంచంవైపు అడుగులు వేద్దాం" అనే థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఐరాస పిలుపు నేపథ్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు మోదీ.
" విధిని ఎదురొడ్డి నిలిచిన దివ్యాంగుల ధైర్యం మనకు స్ఫూర్తినిస్తుంది. దివ్యాంగులైన సోదరసోదరీమణుల జీవితాల్లో సానుకూల మార్పు కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది ఐరాస తీసుకున్న థీమ్‌లో భాగంగా మనమంతా.. మన దివ్యాంగులకు అవకాశాలు కల్పించటం, వాటిని పొందే మార్గాలను మెరుగుపరచటం కోసం సమష్టిగా కృషి చేద్దాం"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఈ ఏడాది వికలాంగుల హక్కుల సదస్సును, డిసెంబర్ 4న జరిగే 13వ సభ్య దేశాల సదస్సుతో పాటుగా నిర్వహించి.. దివ్యాంగులను గౌరవించుకోనున్నట్లు తెలిపింది ఐక్యరాజ్య సమితి.