ఎవరైనా తమకు ఇష్టమైన వారి ప్రత్యేక రోజులను జరుపుకోవాలనుకుంటే పెద్ద ఫంక్షన్ హాల్లో లేదా ప్రత్యేక ప్రదేశాలలో తమ సన్నిహితుల మధ్య చాలా ఘనంగా గుర్తుండిపోయేలా వేడుకలను జరుపుకోవాలనుకుంటారు. కానీ ఒక తండ్రి తన కూతురి మీద ప్రేమతో ఏకంగా అసెంబ్లీలోనే పుట్టిన రోజు వేడుకలను జరపాలని అద్దెకు అడిగిన సంఘటన కర్ణాటకలో జరిగింది.
బెళగావి జిల్లా గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి లాయర్ మల్లికార్జున చౌకశీ.. తన కూతురు పుట్టిన రోజును జరుపుకోవడానికి సువర్ణసౌధను అద్దెకు ఇవ్వాలని స్పీకర్‌కు, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. తన ఒక్కగానొక్క కూతురు మణిశ్రీ ఐదో పుట్టినరోజును గుర్తుండి పోయే విధంగా జరపాలనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
"నా ఒక్కగానొక్క కూతురు మణిశ్రీకి జనవరి 30న 5వ సంవత్సరం పూర్తవుతుంది. ఆమె 1వ తరగతిలో ప్రవేశం పొందబోతుంది. ఇది ఆమె జీవితంలో అమూల్యమైన క్షణం. అందుకే ఆమె పుట్టినరోజు జరుపుకునేందుకు కర్ణాటక సువర్ణసౌధను నాకు ఒక రోజు అద్దెకు ఇవ్వమని కలెక్టర్‌కు, స్పీకర్‌కు అభ్యర్థించాను"
_మల్లికార్జున చౌకశీ
నాలుగు అంతస్తుల సువర్ణ సౌధ భవనం కర్ణాటక శాసనసభ సమావేశాలను నిర్వహించడానికి సంవత్సరానికి ఒకసారి(ఏటా శీతాకాలంలో) మాత్రమే ఉపయోగిస్తారు. ఆ పదిరోజులు సభ జరిపేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది. ఈ ఖర్చులకు తగ్గట్టుగా దానిని సాధారణ సమయాలలో అద్దెకు ఇస్తే బాగుంటుందని.. తద్వారా నిర్వహణ ఖర్చులను ఆదా చేయవచ్చని అభిప్రాయపడ్డారు మల్లికార్జున. సభా సమావేశాలు కూడా కొనసాగుతాయని, దీనిపై సభలో చర్చించి అద్దెకు ఇవ్వాలని కోరారు.
సువర్ణసౌధ(కర్ణాటక అసెంబ్లీ):
ఈ భవనం నాలుగు అంతస్తుల నిర్మాణం. మొత్తం 60,398 చ.మీ. 300 మంది కూర్చునే అసెంబ్లీ హాలు, 100 మంది సభ్యుల కోసం కౌన్సిల్ హాల్, 450-సీట్ల సెంట్రల్ హాల్, 38 మినిస్టీరియల్ ఛాంబర్లు, 14 సమావేశ మందిరాలు ఉన్నాయి. ఇది సమావేశ మందిరాలు, ఒక బాంకెట్ హాల్, శాసనసభ ఉభయ సభలకు సచివాలయాలు, సమావేశ మందిరాలు, కార్యాలయ వసతిని కూడా కలిగి ఉంది.