ETV Bharat / bharat

40 రైతు సంఘాలకు సుప్రీంకోర్టు నోటీసులు - రహదారుల దిగ్బంధం

దిల్లీ సరిహద్దుల్లో రహదారులు దిగ్బంధంపై వివరణ ఇవ్వాలని రాకేశ్​ టికాయిత్​ సహా 40 రైతు సంఘాల నేతలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు(Supreme Court news). నిరసన విరమణ యత్నాలపై హరియాణా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​పై విచారణ చేపట్టింది ధర్మాసనం.

Supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Oct 4, 2021, 2:45 PM IST

Updated : Oct 5, 2021, 5:51 AM IST

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే నిలుపుదల (స్టే) ఉత్తర్వులు విధించినప్పుడు, ప్రస్తుతం అవి అమల్లోనే లేనప్పుడు రైతు సంఘాలు దేనికోసం ఆందోళన చేస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ చట్టాలపై బాధిత పక్షం ఇప్పటికే కోర్టును ఆశ్రయించినందువల్ల ఇంకా ఆందోళన బాటలోనే వెళ్లాల్సిన అవసరం ఏముందని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు సత్యాగ్రహం చేసేందుకు అనుమతి మంజూరు చేసేలా అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ 'కిసాన్‌ మహా పంచాయత్‌' దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది.

ఒక చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఎవరైనా ఆశ్రయించిన తర్వాత అదే అంశంపై నిరసనలు చేపట్టడాన్ని అనుమతించవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ‘ప్రస్తుతం ఆ చట్టాలను అమలు చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి నిరసన దేనిమీద?’ అని ప్రశ్నించింది. రైతులు ఏకకాలంలో రెండు గుర్రాల మీద స్వారీ చేయలేరని తెలిపింది. న్యాయ పోరాటమా, రోడ్లపై ఆందోళనా అనేదానిలో ఒకదానినే ఎంచుకోవాలంది.

వీధుల్లో పోరాటం తగదు: తుషార్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపురి ఖేరిలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ తొలుత ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఆ బాధ్యత తీసుకోరని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాల అంశం సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉన్నప్పుడు అదే అంశంపై మరెవ్వరూ వీధుల్లో పోరాడజాలరని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

దిగ్బంధంపై సమాధానం ఇవ్వండి

రహదారులు దిగ్బంధించడంపై చర్చలకు ఆహ్వానిస్తున్నా రైతులు స్పందించడం లేదన్న హరియాణా ప్రభుత్వ వాదనపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం రైతు సంఘాలకు నోటీసులు ఇచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో పాటు రాకేశ్‌ టికాయిత్‌, దర్శన్‌ పాల్‌, గుర్నామ్‌ సింగ్‌ వంటి రైతు నేతలకు కూడా నోటీసులు పంపిస్తున్నట్లు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ల ధర్మాసనం తెలిపింది. దిల్లీ శివారులోని యూపీ గేటు వద్ద రైతుల ధర్నా శిబిరాన్ని తొలగించాలంటూ నొయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హరియాణా ప్రభుత్వం దీనిపై వినతిని సమర్పించింది. చర్చలకు రావాల్సిన అవసరం లేదంటూ రైతు నాయకులు అనకుండా వారికి నోటీసులు ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.

"43 మందిని కక్షిదారులుగా చేర్చారు. నోటీసులు ఎలా అందజేస్తారు?"అని ధర్మాసనం ప్రశ్నించింది. రైతు నేతలను కక్షిదారులుగా చేర్చాల్సిందేనని, నోటీసులు అందే ఏర్పాట్లు చేస్తానని మెహతా చెప్పారు. విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.

ఇదీ చూడండి: 'రహదారులు దిగ్బంధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా?'

Last Updated : Oct 5, 2021, 5:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.