Punjab police orders: రాజకీయ నాయకుల పర్యటనల్లో.. కొందరు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం చాలా సందర్భాల్లో చూశాం. అలాంటి వాటికి ఆశ్చర్యం కలిగించే రీతిలో పరిష్కారం చూపించారు పంజాబ్ పోలీసులు. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ర్యాలీలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తే.. డీజే సౌండ్ పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. గుర్బాని, సంప్రదాయ పాటలను ప్లే చేయాలని సూచించారు. ఇలా చేయటం వల్ల సీఎంకు వ్యతిరేకంగా చేసే నినాదాలు వినపడకుండా చేయొచ్చని పేర్కొన్నారు.
పోలీసుల తాజా ఆదేశాలు రాజకీయంగా దుమారం రేపాయి. ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడుతున్నారు విపక్ష నేతలు. ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేయటమేనని ట్వీట్ చేశారు పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునిల్ జఖర్.
పోలీసులు ఏమన్నారంటే?
ప్రజలు, విపక్షాల నుంచి విమర్శలు ఎదురైన క్రమంలో డీజే ఆదేశాలపై వివరణ ఇచ్చారు పంజాబ్ పోలీసులు. కిందిస్థాయి ఉద్యోగుల తప్పిదం వల్ల ఆదేశాల అర్థం మారిపోయిందని పేర్కొన్నారు. సీఎం పర్యటనలో అవసరమైన సందర్భాల్లో డీజేలను ఆపాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మేరకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. సీఎం వద్దకు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పుడు డీజే సౌండ్ తగ్గించటం వల్ల బాధితుడు.. తన సమస్యను ముఖ్యమంత్రికి వినిపించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సీఎం విమానం ల్యాండింగ్‌లో ఇబ్బంది- అంతా టెన్షన్ టెన్షన్!