అయోధ్య రామమందిర ప్రాంగణ అభివృద్ధిపై శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రణాళిక సిద్ధం చేసింది. దేశంలోని వివిధ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, వాస్తు శిల్పుల సూచన మేరకు ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడైన డా.అనిల్ మిశ్రా స్పష్టం చేశారు. 70 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంగణాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
నక్షత్ర వాటిక
దేశంలోనే తొలిసారిగా గ్రహకూటమికి సంబంధించి నక్షత్ర వాటికను ప్రాంగణంలో నిర్మించనున్నారు. 27 నక్షత్రాల చెట్లను స్థాపిస్తారు. భక్తులు తమ జన్మదినం రోజు వారి జన్మనక్షత్రం పేరున ఉన్న చెట్టు కింద ధ్యానం చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఐదు గోపురాలు.. 12 గేట్లు
ఆలయ ప్రాంగణ అభివృద్ధిని రెండు దశల్లో చేపట్టనున్నారు. తొలి విడతలో యాత్రికులకు వసతుల ఏర్పాటుపై దృష్టి సారించనున్నారు. రెండో దశలో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. 57,400 చదరపు అడుగులలో నిర్మించనున్న ఆలయానికి 5 గోపురాలు, 12 గేట్లు ఉంటాయి. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగల ఎత్తుతో రామ మందిరాన్ని నిర్మించనున్నారు.
మ్యూజియం..
ఆలయ ప్రాంతంలోని తవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు, పురాతన వస్తువులను ప్రదర్శనలో ఉంచేందుకు మ్యూజియంను నిర్మిస్తారు. వీటితో పాటు ప్రొజెక్షన్ థియోటర్ను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాంగణంలో భక్తులు సంచరించేందుకు వీలుగా అన్ని వసతులు కల్పిస్తామని ట్రస్ట్ సభ్యులు స్పష్టం చేశారు. ఆలయ పునాదిపై ఇప్పటికే రూపకల్పన సిద్ధమైంది.
ఇదీ చదవండి : రామమందిర నిర్మాణ పనులు పునఃప్రారంభం