లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ దాటుకొని వచ్చిన ఓ చైనా సైనికుడిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పీఎల్ఏ జవాను సరిహద్దు దాటి వచ్చాడని సైన్యం వెల్లడించింది. అక్కడ మోహరించిన భారత బలగాలు అతడిని గుర్తించాయని తెలిపింది. పాంగాంగ్ సో సరస్సు దక్షిణాన జవాను పట్టుబడ్డట్లు పేర్కొంది.
జవాను గురించి చైనా సైన్యానికి సమాచారం చేరవేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ఇరుదేశాలు సంప్రదింపులు జరుపుకుంటున్నాయని స్పష్టం చేశాయి. దేశంలోకి రావడానికి గల కారణాలపై దర్యాప్తు చేసిన తర్వాత చైనా సైనికుడి అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.
గతేడాది ఏప్రిల్, మే నెలలో తలెత్తిన ఘర్షణల తర్వాత తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరుదేశాలు వేల సంఖ్యలో తమ సైన్యాన్ని సరిహద్దుకు తరలించాయి. ఎముకలు కొరికే చలిలో, అత్యంత ఎత్తులో సైనికులు పహారా కాస్తున్నారు.