Piyush Jain kanpur raid: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్‌కు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.177.45 కోట్లుగా తేలింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు నగదు లెక్కింపు కొనసాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లెక్కించిన నగదు విలువను.. రూ.177.45 కోట్లుగా తేల్చినట్లు వెల్లడించాయి. అనంతరం పీయూష్ జైన్‌ను అరెస్టు చేసినట్లు వివరించాయి.
IT raids Samajwadi party:
కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీఐటీసీ), డైరెక్టరెట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు కలిసి సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదు సీజ్ చేసిన ఘటనల్లో దేశంలోనే ఇది అతిపెద్దదని భావిస్తున్నారు.
తనిఖీలు ముమ్మరం
కాన్పుర్‌లోని త్రిమూర్తి ఫ్రేగ్రెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, శిఖర్ బ్రాండ్ పాన్ మసాలా తయారీ కేంద్రాలలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎంతమేర పన్ను ఎగవేశారనే విషయాన్ని లెక్కిస్తున్నారని వివరించారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
సీజ్ చేసిన నగదును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశామని ఓ ప్రభుత్వాధికారి స్పష్టం చేశారు. కరెన్సీ చాలావరకు 500 నోట్ల రూపంలోనే ఉందని చెప్పారు. కొన్ని రెండు వేల నోట్ల కట్టలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
సమాజ్‌వాదీ నేత!
Piyush Jain Samajwadi party: పీయూష్ సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సమాజ్‌వాదీ సెంట్ పేరుతో రూపొందించిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు.
ఈ కేసుకు సంబంధించి కాన్పుర్ సహా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, గుజరాత్, ముంబయిల్లో కూడా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ పార్టీ నేత ఇంట్లో రూ.150 కోట్ల నల్లధనం!