PIL On 2000 Note : రూ.2 వేల నోట్ల మార్పిడిపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను మరోసారి తిరస్కరించింది సుప్రీం కోర్టు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశాన్ని కల్పించడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం.. ఈ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని శుక్రవారం చెప్పింది. వేసవి సెలవుల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వాదనలు వింటుందని స్పష్టం చేసింది. ముఖ్యమైన అంశాన్ని విచారణకు స్వీకరించకపోవడం దురదృష్టకరమని అశ్విని కుమార్ ఉపాధ్యాయ చెప్పారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఇది కోర్టని.. బహిరంగ వేదిక కాదంటూ.. ఇంతటితో వాదనలు ముగించాలని తేల్చి చెప్పింది.
అంతకుముందు కూడా.. రూ. 2వేల నోట్ల మార్పిడిపై న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు. దీనిని జూన్ 1న పరిశీలించిన సుప్రీం కోర్టు.. వేసవి సెలవుల్లో ఇలాంటి పిటిషన్లు అత్యవసరంగా విచారించబోమంటూ తిరస్కరించింది. ఆర్బీఐ, ఎస్బీఐ ఎలాంటి పత్రాలు లేకుండా.. నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తుండడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, అవినీతిని అరికట్టేందుకు చేసిన చట్టాలకు వ్యతిరేకమని వివరించారు. రూ. 2,000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఆర్‌బీఐకి, జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఏం ప్రయోజనం కలుగుతుందో రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేయలేదని ఈ పిల్లో పిటిషనర్ పేర్కొన్నారు.
మణిపుర్ ఇంటర్నెట్ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం
Manipur Internet Ban Order : హింస చెలరేగుతున్న మణిపుర్లో ఇంటర్నెట్ నిలిపివేతపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి తరహా కేసు హైకోర్టు పరిశీలనలో ఉందని.. మరోసారి ఇక్కడ వాదనలు ఎందుకని.. అక్కడే వాదించాలంటూ పిటిషనర్లకు సూచించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తరచూ రాష్ట్రంలో ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నారంటూ ఇద్దరు రాష్ట్ర పౌరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను, వ్యాపారం చేసుకునే హక్కుకు భంగం కలిగించడమే అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల ఆర్థిక, సామాజిక, మానసిక అంశాలపైన ప్రభావం పడుతుందని చెప్పారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో జూన్ 10 వరకు ఇంటర్నెట్పై నిషేధం పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బ్రాడ్‌బ్యాండ్ సహా మొబైల్ డేటా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి : 'రూ.2వేల నోటు ఉపసంహరణకు వారికి నో పవర్స్'.. హైకోర్టు తీర్పు వాయిదా
'అందుకే రూ.2వేల నోట్ల ఉపసంహరణ.. ఆర్థిక రంగంపై ప్రభావం ఉండదు'