వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు పేలుడుకు పాల్పడిన నిందితుడిని జమ్ముకశ్మీర్ పోలీసులు.. గురువారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన రియాసి జిల్లాకు చెందిన ఆరిఫ్.. లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడికి పాల్పడ్డాడని జమ్ముకశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
నిందితుడి దగ్గర నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్‌లో అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. కేంద్రపాలిత ప్రాంతంలో ఇలాంటి బాంబును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఆరిఫ్.. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఆదేశానుసారం పనిచేస్తున్నాడని, ఐఈడీలు సరిహద్దు అవతల నుంచి అతడి దగ్గరకు వస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
"జమ్ముకశ్మీర్లో పెర్ఫ్యూమ్ ఐఈడీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఎవరైనా నొక్కడానికి లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ఐఈడీ పేలుతుంది. మా ప్రత్యేక బృందం ఆ ఐఈడీని పరిశీలిస్తుంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్లో ఉన్న ప్రజల మధ్య మతపరమైన విభజన సృష్టించాలని పాకిస్థాన్ కోరుకుంటోంది."
-- దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్
గతేడాది మే నెలలో.. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో జమ్ము శాస్త్రినగర్తోపాటు నార్వాల్లో జరిగిన జంట పేలుళ్లలో తొమ్మిది మంది గాయపడ్డారు.