మీరు కళ్లద్దాలు ధరిస్తున్నారా?..అయితే మీరు కరోనా బారిన పడే అవకాశం తక్కువట. భారతీయ పరిశోధకులు వెలువరించిన ఓ అధ్యయనం(పూర్తిస్థాయిలో నిపుణులు సమీక్షించని) ఈ విషయాన్ని వెల్లడిచేస్తోంది. ఓ ఆసుపత్రిలో 223 మంది పురుషులు, 81 మంది స్త్రీల(10 నుంచి 80మంది మధ్య వయస్కులు)పై రెండు వారాలపాటు ఈ పరిశోధనను నిర్వహించారు.
కళ్లు, చెవులు, నోరు, ముక్కును చేతులతో తాకొద్దని కరోనా వెలుగుచూసిన దగ్గరి నుంచి ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తునే ఉన్నారు. రోజులో ఎక్కువ సమయం కళ్లద్దాలు ధరించేవారు తమ కళ్ల వద్దకు చేతులు పోనిచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని..దాంతో వారికి వైరస్ సోకే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని ఆ అధ్యయనకర్తలు అంటున్నారు. తమ అధ్యయనంలో పాల్గొన్నవారు 23 సార్లు ముఖాన్ని, మూడుసార్లు కళ్లను తాకారని వెల్లడించారు. 19 శాతం మంది రోజుమొత్తంలో ఎక్కువ సమయం కళ్లద్దాలు ధరించారని వెల్లడించారు. దాంతో వాటిని ధరించేవారికి కొవిడ్ సోకే అవకాశం రెండు నుంచి మూడు రెట్లు తక్కువగా ఉండనుందని వారు అభిప్రాయపడ్డారు. అవి రక్షణ తొడుగుల్లా వ్యవహరిస్తాయన్నారు. మానవ శరీరంలోకి కళ్లద్వారా వైరస్ ప్రవేశించడానికి అవకాశం ఉండటంతో.. వైరస్ వచ్చిన కొత్తల్లో కాంటాక్ట్ లెన్స్ వాడేవారు కళ్లద్దాలకు మారమని నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: వ్యాధులే కాదు... ఔషధాలూ అరుదే!