ఉత్తరాఖండ్ ఉత్పాతాల్లో మిగిలినవి ఒక ఎత్తయితే 2013 జూన్ 16న వచ్చిన వరదలు మరో ఎత్తు. ఆ వరదల్లో మునుపెన్నడూ లేనిరీతిలో 5,700 మంది విగతజీవులుగా మారినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ వరదల ధాటికి చార్‌ధామ్ తీర్థయాత్రకు వెళ్లే మార్గాల్లో 3 లక్షలకు పైగా జనం చిక్కుకున్నారు. అనేక వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. 2004 సునామీ తర్వాత దేశం ఎదుర్కొన్న తీవ్రస్థాయి వైపరీత్యం ఇదే. హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, దిల్లీ, యూపీలలో వేర్వేరు చోట్ల ఆ ఏడాది జూన్ 16న కురిసిన కుంభవృష్టి, పశ్చిమ నేపాల్, పశ్చిమ టిబెట్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కలిసి ఉత్తరాఖండ్‌ను ముంచేశాయి. వరదల్లో చిక్కుకుపోయిన వారిలో లక్ష మందికి పైగా ప్రజల్ని భారత సైన్యం, వాయుసేన, పారా మిలిటరీ బలగాలు రక్షించాయి. సాధారణ రుతుపవన కాలం కంటే 375% ఎక్కువగా వానలు ఆ రోజు కురిశాయి. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికకు తగినంత ప్రచారం కల్పించకపోవడంతో ఆస్తి, ప్రాణనష్టం బాగా పెరిగింది. ఆ వరదల్లో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. విలయంలో చనిపోయినవారిలో 556 మంది మృతదేహాలు ఆ ఏడాది సెప్టెంబరులో లభ్యమయ్యాయి. వాటిలో 166 దేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాయి. కేదార్‌నాథ్ ఆలయాన్ని బండరాళ్లు, బురద వంటివి కొంతమేర దెబ్బతీశాయి.
ఏమిటీ రుషిగంగా ప్రాజెక్టు?
ఇది ప్రయివేటు జల విద్యుదుత్పత్తి సంస్థ. తొలుత పెద్ద ఆనకట్టలు కట్టి జలవిద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేయడం ఎక్కడైనా జరిగేదే. కానీ నీటి ప్రవాహానికి అనుగుణంగా ఎక్కడికక్కడ టర్బయిన్లు ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకత. చిన్నచిన్నవి వరుసగా ఏర్పాటు చేసుకుంటూ పోతారు. ఇలా చేస్తే పర్యావరణానికి నష్టం కలుగుతుందని స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేశారు కూడా.
ప్రమాదాలు పరిపాటి
అద్భుతమైన సహజ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం ఆ రాష్ట్రం. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నెలవు. హిమాలయా పర్వత సానువుల్లో ఒద్దికగా ఉండే ఉత్తరాఖండ్‌పై ప్రకృతి ఎన్నోసార్లు పగపట్టినట్లు కనిపిస్తుంది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడడం, భూకంపాలు.. ఇవన్నీ ఉత్తరాఖండ్‌ను వణికిస్తుంటాయి. తాజాగా మంచు చరియలు విరిగిపడి పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడం ఆ రాష్ట్రాన్ని మరోసారి వార్తల్లో నిలబెట్టింది. ఇలాంటి విషాద ఘటనలు ఉత్తరాఖండ్‌కు కొత్త కాదు. ఇప్పటివరకు అక్కడ సంభవించిన ప్రమాదాల్లో వేల మంది మరణించారు.
ఉత్తరకాశీ భూకంపం
6.8 తీవ్రతతో 1991 అక్టోబర్‌లో సంభవించిన ఈ భూకంపం ధాటికి 768 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మల్పా దుర్ఘటన
పితోడ్‌గఢ్ జిల్లా మల్పాలో 1998లో కొండచరియలు విరిగిపడి 255 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 55 మంది కైలాస్ మాన్ సరోవర్ యాత్రికులు. కొండచరియలు పడడం వల్ల శర్దా నది ప్రవాహానికి పాక్షికంగా అడ్డుకట్ట పడింది.
చమోలీ భూకంపం
చమోలీలో 1999లో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి 100 మందికిపైగా బలయ్యారు. పక్కనే ఉన్న రుద్రప్రయాగ్ జిల్లా కూడా ఈ భూకంపం ధాటికి ప్రభావితమైంది. పలు రహదారులు దెబ్బతిన్నాయి. నదులు ప్రవహించే మార్గాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్ విలయం: 14మందికి చేరిన మృతులు