ఉత్తరాఖండ్లో ఓ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. చమోలీ జిల్లా గార్సేన్ ప్రాతంలోని ఘూట్ నుంచి నందప్రయాగ్ వరకు గల 19కి.మీ రోడ్డును విస్తరించాలని పట్టుబట్టిన స్థానికులు ఆందోళనకు దిగారు.
ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను సైతం లెక్కచేయకుండా నిరసనకారులు రెచ్చిపోయారు. వీరిని నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో జల ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు.
దివాళీ ఖల్ ప్రాంతంలో ఆందోళనకారులు బారీకేడ్లను విరగ్గొట్టారు. నిరసనలను అదుపు చేయడానికి ప్రయత్నించిన మాపై వారు రాళ్లు విసిరారు. మాలో చాలామంది పోలీసు సిబ్బంది గాయాలపాలయ్యారు.
-యశ్వంత్ సింగ్, చమోలీ ఎస్పీ
చమోలీ ఆందోళనలపై ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు. ఈ ఘటనపై మేజిస్టేరియల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: కశ్మీర్లో నలుగురు 'నార్కో' ఉగ్రవాదుల అరెస్ట్