మంచి రోడ్లతో కూడిన మౌలిక సదుపాయాలు కావాలంటే ప్రజలు అందుకు కొంతమొత్తం చెల్లించాల్సిందేనని టోల్ ఛార్జీలనుద్దేశించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యాఖ్యానించారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే (Delhi Mumbai expressway) నిర్మాణ పనులను గురువారం సమీక్షించిన ఆయన హరియాణాలోని సోహ్నాలో మీడియా ప్రతినిధులతో (Nitin Gadkari) మాట్లాడారు. టోల్ ఛార్జీల మూలంగా రవాణా వ్యయాలు పెరుగుతున్నాయని ఓ విలేకరి ప్రశ్నించగా.. "మీకు ఎయిర్ కండీషన్‌తో కూడిన హాల్ కావాలంటే ఎంతో కొంత చెల్లించాల్సిందే. లేదనుకుంటే పొలంలో కూడా వివాహ వేడుకలను ఏర్పాటు చేసుకోవచ్చు" అని గడ్కరీ వ్యాఖ్యలు చేశారు.
160 కి.మీ. వేగంతో కారులో..
ఎక్స్‌ప్రెస్ వే గురించి గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడుతూ.. ఈ రహదారి అందుబాటులోకి వస్తే దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ- ముంబయి మధ్య ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుందని పేర్కొన్నారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పైన 160 కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణించానని తెలిపారు.
ప్రస్తుతం ఓ ట్రక్కు దిల్లీ నుంచి ముంబయి చేరుకోవాలంటే 48 గంటలు పడుతోందని, ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అది 18 గంటల్లోనే చేరుతుందని పేర్కొన్నారు. అప్పుడు ట్రక్కు మరిన్ని ట్రిప్స్ వేయడానికి వీలు పడుతుందని చెప్పారు. అలాగే ఎక్స్‌ప్రెస్ వేను ఆనుకుని ఉన్న భూములను రైతులు విక్రయించడానికి బదులు.. సదుపాయాల కల్పనలో డెవలపర్లతో కలిసి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్రమంత్రి ఇంద్రజీత్ సింగ్ పాల్గొన్నారు. దిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల మీదుగా 1380 కిలోమీటర్ల మేర 8 వరుసల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌వే(Delhi Mumbai expressway) రూపుదిద్దుకుంటోంది. మొత్తం రూ.98వేల కోట్లు వెచ్చించనున్నారు. 2023 మార్చి నాటికి నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి.
ఇవీ చదవండి: